ఎన్టీఆర్, రాజమౌళి ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికీ! ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లు అన్నీ.. జక్కన్న డైరెక్ట్ చేసినవే. కెరీర్ స్టార్టింగ్‌లో స్టూడెంట్ నంబర్ వన్‌తో బ్రేక్ ఇచ్చిన రాజమౌళి.. సింహాద్రితో తారక్‌ను స్టార్‌ని చేశాడు. యమదొంగ మూవీతో ఎన్టీఆర్ కెరీర్‌ను గాడిలో పెట్టాడు. ట్రిపుల్‌ఆర్‌తో ప్యాన్ ఇండియన్ స్టార్ చేశాడు. డైరెక్టర్, హీరో అనేకంటే.. ఓ ఫ్యామిలీ బాండింగ్ కనిపిస్తుంటుంది ఇద్దరి మధ్య. ట్విట్టర్‌లో తారక్‌కు 70లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉంటే.. ఎన్టీఆర్ ఫాలో అయ్యేది మాత్రం రాజమౌళి ఒక్కడినే ! జక్కన్న పుట్టినరోజు రోజు సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పాడు. హ్యాపీ బర్త్ డే జక్కన్న అంటూ ట్వీట్ చేశారు.
షూటింగ్ స్పాట్‌లో రాజమౌళితో కలిసి ఉన్న ఫొటోను ఎన్టీఆర్ తన ట్వీట్‌కు యాడ్ చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఐతే కింద కామెంట్లే కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ తీవ్రంగా స్ట్రగుల్ అవుతోంది. జగన్‌ను నిలదీసే ప్రయత్నం చేస్తున్నాయ్ ఆ రెండు కుటుంబాలు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తప్ప.. చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి, నారా ఫ్యామిలీకి చెందిన ప్రతీ ఒక్కరు రియాక్ట్ అయ్యారు. ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో తెలియదు కానీ.. చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటివరకు తారక్ నోరు విప్పలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు.
అదే చేత్తో చంద్రబాబు గురించి కూడా రెండు ముక్కలు రాయండయ్యా అని కొందరు రియాక్ట్ అవుతుంటే.. రాజమౌళికి విషెస్ చెప్పడంలో తప్పు లేదు. చంద్రబాబు అరెస్ట్ మీద ఎందుకు స్పందించడం లేదు అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మీ పార్టీకి, మీ కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే.. ఒక్క మాట కూడా మాట్లాడని మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఫ్రెండ్ బర్త్‌డేకు విషెస్ చేస్తే.. దాని గురించి మాట్లాడకుండా కొత్త వివాదం రేపడం ఏంటని తారక్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలను, సినిమాలను, కుటుంబాలను ఒక్కటి చేసి మాట్లాడడం.. కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు అంటూ.. పోస్టులు పెడుతున్నారు. ఏమైనా ఎన్టీఆర్ రియాక్ట్ అయినా కాకపోయినా.. ఏ విషయంలో స్పందించినా.. అది రచ్చగానే మిగులుతోందిప్పుడు.