ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్స్ పెరిగిపోతున్నారు. వైసీపీలో టిక్కెట్లు రాని నేతలంతా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. కొందరు కాంగ్రెస్ లో షర్మిలకు పోస్ట్ ఇచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన పొత్తుల సంగతి తేలలేదు కాబట్టి.. ఇట్నుంచి ఇంకా ఎవరూ వైసీపీలోకి దూకట్లేదు. కానీ ఇక్కడ అర్థంకాని విషయం ఏంటంటే.. వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న నేతల్లో చాలా మంది ఒకప్పుడు ఇక్కడ ఫిరాయించి అక్కడికి వెళ్ళిన వారే. వైసీపీలో వీళ్ళ వల్ల లాభం లేదనుకొని.. పార్టీ టిక్కెట్లు ఇవ్వకపోవడంతోనే.. టీడీపీలోకి వస్తున్నారు. ఈ పాతబ్యాచ్ ని చేర్చుకొని చంద్రబాబు ఏం చేయబోతున్నారు. వీళ్ళకి నియోజకవర్గాల్లో ఓట్లు పడతాయా అన్న చర్చ టీడీపీలో నడుస్తోంది.
గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు …అధికార పార్టీ నుంచి వచ్చిన నేతలకు టీడీపీ జెండాలు కప్పుతున్నారు. బుధవారం ఒక్కరోజే ముగ్గురు లీడర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ టైమ్ లో ఇలా పార్టీల మారడం అన్నది అన్నిచోట్లా ఉండేదే. కానీ టీడీపీలోకి వస్తున్న వాళ్ళని చూస్తే మాత్రం.. వాళ్ళేమీ ఓట్లు రాల్చే బ్యాచ్ కాదని తెలుస్తోంది. వైఎస్సార్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకున్నామని బాబు గొప్పలు చెప్పుకోడానికే పనికొస్తుందేమో.
టీడీపీలో చేరిన దాడి వీరభద్రతరావు, ద్వారకా నాథ్ రెడ్డి, సి. రామచంద్రయ్య.. వీళ్ళకు వైసీపీలో ఇక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటే తమ పార్టీకి ఏవైనా నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయా అని టీడీపీ నేతలు, కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయిన వీళ్ళు.. అక్కడ అవకాశాలు దొరక్క మళ్ళీ వస్తే చేర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో మహానాడులో కూడా ఇలా ఫిరాయింపు నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తుంటారని గౌతు శిరీష బహిరంగంగానే మాట్లాడారు. లేదు ఈసారి అలాంటి వారికి అవకాశం ఇవ్వనన్నారు బాబు. పార్టీని నమ్ముకున్న వారికే పదవులు, హోదాలు ఇస్తామని మాట ఇచ్చారు.
ఒకే.. చంద్రబాబు ఇప్పటికీ అదే స్టాండులో ఉన్నారా.. ఇప్పుడు చేర్చుకున్న నేతలకు ఏవైనా హామీలు ఇచ్చారా.. మళ్ళీ వీళ్ళకి టిక్కెట్లు, పదవులు ఇస్తే.. తమకు అన్యాయం జరుగుతుందని ఆయా నియోజకవర్గాల టీడీపీ లీడర్లు టెన్షన్ లో ఉన్నారు. అసలే జనసేన పొత్తుతో టిక్కెట్లు వస్తాయో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఫిరాయింపుల బ్యాచ్ తో ఉన్న అవకాశాలు కూడా పోతాయేమో అని టెన్షన్ పడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. వైసీపీలో ముసలోళ్ళని తొలగించి.. వాళ్ళ వారసులకో.. మిగతా యువతకో టిక్కెట్లు ఇస్తున్నారు. కానీ టీడీపీలో యువనేత అని చెప్పుకోడానికి నారా లోకేష్ తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఇప్పటికైనా బాబు ఆలోచన మార్చుకొని.. ఆ నాటి 2జీ తరాన్ని వదిలేసి.. యంగ్ తరంగ్ 5 జీ తరాన్ని ప్రోత్సాహించాలని కోరుతున్నారు.