సినిమాల్లో రాజకీయాలు ఉంటాయో లేదో కానీ.. రాజకీయం మాత్రం ఎప్పుడూ సినిమాలానే ఉంటుంది. ఎలివేషన్లు, ట్విస్టులు, ఎండింగ్‌లు.. రాజకీయాలు తెలిసినవారు మాత్రమే ఫీలయ్యే ఆనందం అది. రాజకీయానికి, సినిమాకు లింక్ ఎప్పుడూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే అది మరీ ఎక్కువ. సినిమాలు చేసుకొని.. రాజకీయాల్లోకి వచ్చి రాణించిన వారు చాలామందే ఉన్నారు లెక్కతీస్తే ! సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్.. ఎలాంటి సక్సెస్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ.. ఆ తర్వాత జనరేషన్‌లో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఇలా సినిమాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బాలయ్య ఎమ్మెల్యేగానూ అసెంబ్లీలో అడుగుపెట్టి.. తండ్రి లెగసీ కంటిన్యూ చేస్తున్నారు.
నందమూరి ఫ్యామిలీని, టీడీపీని వేరు చేసి చూడలేని పరిస్థితి. నందమూరి ఫ్యాన్స్‌లో మెజారిటీ వర్గం.. టీడీపీ వైపే ఉంటారు. ఎలాంటి డౌట్ లేదు ఇందులో. అటు మెగా ఫ్యాన్స్ జనసేన వైపు ఉండటం కామన్. ఇదంతా ఎలా ఉన్నా.. ఏపీలో దాదాపు అన్ని పార్టీలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించాయ్. ఎందుకు ఖండించారు అన్న సంగతి పక్కనపెడితే.. తెలంగాణలోనూ కొందరు నేతలు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై.. టీడీపీకి అనుకూలంగా కామెంట్లు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా ఎవరు ఎలాంటి కామెంట్లు చేశారన్న విషయాన్ని.. నందమూరి అభిమానులు, టీడీపీ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రియాక్ట్ కావడం లేదు అన్న విషయం మీదే పట్టిన పట్టు వీడడం లేదు.
నిజానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రియాక్ట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సినిమాల్లో బిజీగా ఉన్నారు.. సైమా ఫంక్షన్లలో బిజీగా ఉన్నారు.. తర్వాత వెళ్లి చంద్రబాబును కలుస్తారు లే అనుకుంటే.. అది కూడా నిజం కాలేదు. ఐతే తారక్‌ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ.. జూనియర్ అభిమానులు పదేపదే చెప్తున్నా.. రచ్చ మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది ఈ విషయంలో. ఇలాంటి సమయంలో.. ఎన్టీఆర్ వ్యవహారంలో బాలయ్య స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. తారక్ ఎందుకు స్పందించలేదు అని అడిగితే.. ఎవరు స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ ఆన్సర్ ఇచ్చారు. బాలయ్య మాటలపై జూనియర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
బాలయ్య అలా అనడం కరెక్ట్ కాదని పోస్టులు పెడుతున్నారు. ఇలా ఇప్పుడు ఎన్టీఆర్, బాలయ్య అభిమానుల మధ్య రచ్చ మొదలవగా.. ఇద్దరి మధ్య ఎవరైనా చిచ్చుపెడితే.. టీడీపీకి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎన్టీఆర్ రావాల్సింది.. బాలయ్య అలా అనకుండా ఉండాల్సింది.. అప్పుడు టీడీపీ పరిస్థితి ఇంకోలా ఉండేదని కొందరు అంటుంటే.. బాలకృష్ణ మాటలతో టీడీపీకి దెబ్బ తప్పదని ఇంకొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.