ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. నిన్నమొన్నటివరకు చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడన్న అపవాదును మూటగట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా రూటు మార్చారు. ఇన్నాళ్లూ టీడీపీతో పొత్తుకోసం వెంపర్లాడినట్టు కనిపించిన పవన్.. ఇప్పుడు తనలోని అసలైన రాజకీయ నీతిని బయటకు తీశాడు. ఎవడో వేసే ముష్టి తనకు అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. తానే సీఎంని అని..ప్రజలకు కూడా కావాల్సింది అదేనని కుండ బద్దలు కొడుతున్నారు. అటు ఏపీలో ఎక్కువ నియోజకవర్గాలను ప్రభావితం చేయగల కాపులు కూడా తమవైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య కులాల సర్వే కూడా చంద్రబాబును ఇరుకున పెట్టేలాగే ఉంది.
హరిరామజోగయ్య సర్వే:
పవన్ కల్యాణ్‌కు రాజకీయ పరంగా మొదటి నుంచి మద్దతు ఇస్తున్న నాయకుడు చేగొండి హరిరామజోగయ్య. కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ఆయన.. తాజాగా ఓ సర్వే ఫలితాలను విడుదల చేశారు. దాని ప్రకారం గోదావరి జిల్లాల్లో అన్నీ కులాల వాళ్లు పవన్ వైపే ఉన్నారని..ముఖ్యంగా కాపులు 80శాతం జనసేన వైపు, 12శాతం వైసీపీ వైపు,8శాతం టీడీపీ వైపు ఉన్నారని సర్వే చెబుతోంది. 35 రోజుల పాటు కాపు సంక్షేమ సేన ఈ సర్వే చేసింది. ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఇప్పుడిదే చంద్రబాబు వర్గంలో ఆందోళన రేపుతోంది.
టీడీపీలో ఎందుకు కలవరం మొదలైంది..?
చేగొండి హరిరామజోగయ్య కులాల సర్వే వాస్తవానికి దగ్గరగా ఉందా దూరంగా ఉందానన్నది అటు ఉంచితే.. అసలు ఈ సర్వేనే చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా మొదటి నుంచి పవన్ వెంటే ఉన్న హరిరామజోగయ్య గతంలో అనేకసార్లు జనసేన అధినేతకు కీలక సూచనలు చేశారు. వైసీపీకి, టీడీపీకి సమాన దూరం పాటించాలని అనేక సార్లు చెప్పారు. చంద్రబాబునాయుడు జనసేనను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని కూడా అప్పట్లో వ్యాఖ్యానించారు. కాపు నేతనే సీఎంగా చూడాలని జోగయ్య కోరుకుంటున్నారు.. ఇప్పుడు పవన్ కూడా అదే కోరుకుంటున్నారు. అలా జరిగితేతే తమ కులానికి మేలు జరుగుతుందని ఇద్దరి ఆలోచన కావొచ్చు. 175స్థానాల్లో పోటి చేసే సత్తా ప్రస్తుతానికి జనసేనకి లేదు. అందుకే టీడీపీతో పొత్తు తప్పనిసరి..అయితే ఆ పొత్తు పవన్ డిమాండ్ల ప్రకారమే జరిగేలా కనిపిస్తుంది. జగన్‌ని ఓడించడానికి ఏ త్యాగానికైనా సిద్ధమంటూ చంద్రబాబు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.. ఇటు పవన్ ఎక్కువ సీట్లు అడగొచ్చు.. లేకపోతే చేరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న ప్రతిపాదికన పొత్తు కుదర్చుకోవచ్చు..!
సర్వేలోని ఫలితాలు చూస్తే కాపులు పవన్ తర్వాత వైసీపీకి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సర్వే క్రెడిబిలిటీని నమ్మలేం. ప్రీ పోల్స్‌కి ఎగ్జిట్ పోల్స్‌లో ఫలితాలకే చాలా తేడా ఉంటుంది. అలాంటి ఓ కులానికి చెందిన సర్వే..అది కూడా ఎన్నికలకు 9నెలలకు ముందు చేసిన సర్వే నిజాలను చెబుతుందని ఆశించలేం.. ఈ విషయం 40ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు తెలియనది కాదు. కేవలం పవన్ స్థాయిని ఎక్కువ చేసి చంద్రబాబును పరోక్షంగా ఇరుకున పెట్టే ప్రయత్నమే ఇది. అందుకే చంద్రబాబుకు కేవలం 8శాతం మంది కాపులే సపోర్టు ఇస్తున్నట్టు జగన్ కంటే తక్కువ చేసి చూపించి ఉండొచ్చు. ఇదంతా పవనే వెనక నుంచి ఆడిస్తున్న గేమ్ కావొచ్చు. మొత్తానికి అంతా సాఫీగా సాగిపోతుందని చంద్రబాబు అనుకున్నట్టు ప్రస్తుత పరిస్థితులు లేవు. పవన్ పాచికలను ఆయన ఎదుర్కొంటారో చూడాలి.. ఒంటరిగా వెళ్లే దైర్యం చంద్రబాబుకు ఎలాగో లేదు..ఇటు పవన్‌కి కూడా లేదు..కానీ పవన్ తనకుందని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇదే టీడీపీకి మొదలైన కొత్త టెన్షన్..!