సినిమా హిట్ అయితే.. గిఫ్ట్స్ ఇవ్వడం చూస్తూనే వున్నాం. కానీ.. కారు గిఫ్ట్‌తోపాటు చెక్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు కలెక్ట్ చేయడంతో నిర్మాత కళానిధి మారన్ రజనీ ఇంటికెళ్లి లాభాల్లో వాటా ఇచ్చారు.
బాక్సాఫీస్ ఊచకోత ఎలా వుంటుందో జైలర్ చూపించింది. . 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన జైలర్‌తో తన స్టామినా ఏమిటో మరోసారి నిరూపించాడు రజనీ. రిలీజై మూడు వారాలు దాటినా.. ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాను నిర్మించిన కళానిధి మారన్ రజనీకాంత్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. రజనీకాంత్‌ను కలిసిన కళానిధి మారన్ చెక్ అందించారు. అలాగే.. రెండు బిఎండబ్ల్యూ కార్లను తీసుకెళ్లి.. నచ్చిన కారును సెలెక్ట్ చేసుకోమన్నారు. బీఎండబ్ల్యూ ఎక్స్ 7 మోడల్ కారును సెలెక్ట్ చేసుకోగా.. దీని ధర కోటి పాతిక లక్షలు వుంటుందని అంచనా. జైలర్ భారీ లాభాలు తీసుకురావడంతో.. రెమ్యునరేషన్‌కు అదనంగా దాదాపు 50 కోట్లు ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.
ఆసియాలో జాకీచాన్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్ పేరు గతంలో వినిపించేది. అయితే వరుస ఫ్లాపుల తర్వాత సూపర్‌స్టార్ రెమ్యునరేషన్ తగ్గినా… జైలర్‌తో మరోసారి సత్తా చాటాడు. జైలర్ కోసం.. 110 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు. లేటెస్ట్‌గా 40.. 50 కోట్లు కలిపితే… తలైవా పారితోషికం.. 150 కోట్లు దాటిపోయింది. అదనంగా కోటి పాతిక లక్షల కారు గిఫ్ట్ అందుకున్నాడు.
సినిమా హిట్ తర్వాత బహుమతులు ఇవ్వడం కామనే అయినా.. ఇలా 40.. 50 కోట్లు అదనంగా ఇవ్వడం అనేది చూడలేదు. కళానిధి మారన్ రజనీకాంత్ పట్ల కృతజ్ఞత తెలియజేశారంటున్నారు. ఈ ఇద్దరి కాంబో రోబోతో మొదలైంది. ఆ తర్వాత తీసిన పేట అన్నాత్తే నిరాశపరిచాయి. రోబోను మించి జైలర్ భారీ లాభాలు తీసుకొచ్చింది.