Kangana Ranaut: కింగ్ వర్సెస్ క్వీన్.. మండిలో గెలుపెవరిది..? కంగనా పరిస్థితి ఏంటి..?

ఇక్కడినుంచి బీజేపీ తరఫున బాలీవుడ్ నటి, క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ పోటీలో ఉండటమే. కాంగ్రెస్ తరఫున ఇక్కడి నుంచి రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్‌ పోటీపడుతున్నారు. దీంతో మండిలో కింగ్ వర్సెస్ క్వీన్‌గా పోటీ మారిపోయింది.

  • Written By:
  • Updated On - April 15, 2024 / 04:25 PM IST

Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కారణం.. ఇక్కడినుంచి బీజేపీ తరఫున బాలీవుడ్ నటి, క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ పోటీలో ఉండటమే. కాంగ్రెస్ తరఫున ఇక్కడి నుంచి రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్‌ పోటీపడుతున్నారు. దీంతో మండిలో కింగ్ వర్సెస్ క్వీన్‌గా పోటీ మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు ఎంపీగా గెలుస్తారనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ప్రస్తుతం పోటీ హారాహోరీగా సాగుతోంది.

YS SHARMILA: మద్యపాన నిషేధం అంటే ప్రభుత్వమే మద్యం అమ్మడమా..?: వైఎస్ షర్మిల

బాలీవుడ్‌లో నటిగానే కాకుండా.. నిత్యం వివాదాలతో కూడా గుర్తింపు తెచ్చుకుంది కంగనా. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. రాజకీయాలపై ఆసక్తి చూపించింది. హిందూత్వకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్.. కంగనా సొంత రాష్ట్రం. అందుకే మండి నుంచి ఆమెను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విక్రమాదిత్యకు భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇప్పటికే ఆయన అక్కడ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌. తల్లి.. హిమాచల్‌ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌. పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు విక్రమాదిత్య. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మండిలో 1952 నుంచి 19 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో రాజకుటుంబానికి చెందిన వాళ్లే 13సార్లు గెలిచారు. విక్రమాదిత్య తల్లి, తండ్రి కూడా గతంలో ఇక్కడినుంచి గెలిచారు. అలా ఈ నియోజకవర్గంతో విక్రమాదిత్యకు, ఆయన కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. అందువల్ల విక్రమాదిత్యకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది విశ్లేషకుల అంచనా.

అయితే.. హిమాచల్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జైరాం ఠాకూర్​కు మండిలో మంచి పట్టు ఉంది. అలాగే.. మండి నియోజకవర్గ పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ అంశాలు తనకు బాగా కలిసివస్తాయని కంగనా అంచనా వేస్తోంది. మరోవైపు.. కంగనా, విక్రమాదిత్య.. ఇద్దరూ.. ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. కంగనాకు అసలు హిమాచల్ గురించి ఏమీ తెలియదని విక్రమాదిత్య విమర్శించాడు. కంగనాకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై కంగనా మండిపడింది. మండి.. ఆయన తాతల జాగీరు కాదని.. తాను గెలిచి తీరతానంటున్నారు. ఇంకోవైపు.. కొన్ని అంశాల్లో అవగాహన లేకుండా కంగనా చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలపాలవుతున్నాయి. ఏదేమైనా.. ఈసారి విమర్శలు, ప్రతి విమర్శలతో మండి నియోజకవర్గం మాత్రం ఆసక్తికరంగా మారింది.