Kanna Lakshminarayana: కన్నా పార్టీ మారడం ఖాయమా..? ఏ పార్టీలోకి..?

  • Written By:
  • Updated On - February 10, 2023 / 06:07 PM IST

ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కమలంలోనే ఉంటూ కంటికి నలుసులా తయారైన కన్నా… పార్టీ మారడం ఖాయమనిపిస్తోంది. త్వరలోనే కాషాయ కండువా పక్కనపెట్టి మరో కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. జనసేనలోకి వెళ్లి గాజు గ్లాసు పట్టుకుంటారని అందరూ అనుకుంటుంటే ఆయన మాత్రం సైకిలెక్కాలని భావిస్తున్నట్లు లేటెస్ట్ ప్రచారం మొదలైంది.

సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ సీనియర్ నేత… మొన్నీ మధ్యే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును టార్గెట్ చేశారు. అబ్బే పార్టీని పట్టాలెక్కించడం ఆయన వల్ల కాదంటూ పూచికపుల్లలా తీసిపారేశారు… దీనిపై సోము హైకమాండ్్కు కూడా కంప్లయింట్ కూడా చేశారు. నువ్వు చేసేది చేసుకో నేననేది నేనంటా అన్నట్లు వ్యవహరించారు కన్నా… అప్పట్నుంచి పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు కన్నా…

తాజాగా మరోసారి నోటికి పనిచెప్పారు ఈ సీనియర్ పొలిటీషియన్. రాష్ట్ర నేతలపై విమర్శలు చేస్తే కిక్ లేదనుకున్నారో లేక ఢిల్లీ నేతలను టార్గెట్ చేస్తేనే మజా ఉంటుందనుకున్నారో కానీ ఈసారి ఏకంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావునే టార్గెట్ చేశారు… కాపులకు ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారంటూ జీవీఎల్ ను నిలదీశారు. అంతేకాదు చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ సుదీర్ఘ కాలం నుంచి ఉందన్న ఆయన… చంద్రబాబు కృషి, చొరవతోనే రాష్ట్రంలో కాపులకు గుర్తింపు, రిజర్వేషన్లకు తుదిరూపు వచ్చిందంటూ క్రెడిట్ అంతా టీడీపీ నేతకు కట్టబెట్టే యత్నం చేశారు. నిజానికి వైఎస్ హయాంలోనే కాపు రిజర్వేషన్ల దిశగా అడుగులు పడ్డాయి. రాజశేఖరరెడ్డి హయాంలోనే దీనిపై కమిటీ వేశారు. అప్పుడు కన్నా కూడా మంత్రిగా ఉన్నారు. అయితే చంద్రబాబు హయాంలో రిజర్వేషన్లు ప్రకటించారు. దీన్నే హైలెట్ చేయడానికి ప్రయత్నించారు కన్నా. కాపులకు వైసీపీ చేసిందేమీ లేదంటూ విమర్శలు కూడా గుప్పించారు. కన్నాలక్ష్మీనారాయణ మాటలు చూస్తుంటే సైకిల్ సవారీ ఖాయమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తరపున పోటీ చేసి గెలవగలనన్న నమ్మకం ఆయనకు లేదు. అదేదో టీడీపీలోకే పోతే తనకు కాకపోయినా తన వారసులకైనా టికెట్ దక్కొచ్చన్నఆశ ఆయనకు ఉంది. పైగా నియోజకవర్గంలో అంతో ఇంతో బలం, బలగం కూడా ఉంది. ఎలాగూ పవన్ కూడా సైకిల్ తో సవారీ చేస్తారన్నది ఆయన ఆలోచన.

జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మాట్లాడారు కన్నా… ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయని.. రాజకీయ నిర్ణయాలు ఆయనకే వదిలేయాలన్నారు. పవన్ టీడీపీతో జతకడతారన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం చేకూరింది.

కన్నా ధైర్యం ఏంటో ఏపీ బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. ఆయన్ను ఎలా కంట్రోల్ చేయాలో వారికి అర్థం కావడం లేదు. పోనీ అధిష్ఠానం స్పందిస్తుందా అంటే అదీ లేదు.. పోతే ఆయనే పోతారులే అన్నట్లుంది..పైగా కన్నాకు బీజేపీ హైకమాండ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని ఆయన మాటల వెనక వేరే అర్థాలున్నాయని ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. దీంతో దీనిపై ఎలా స్పందించాలో ఏపీ బీజేపీ నేతలకు పాలుపోవడం లేదు. మరి కన్నా ఇలాగే కొంతకాలం కమలంలో ఉంటూ కామెంట్ల కుంపట్లు రగిలిస్తారా లేక త్వరలోనే పార్టీని వీడతారా అన్నది మాత్రం ఆసక్తిని రేపేదే…

(KK)