సత్తెనపల్లిలో కాపు VS కాపు అంబటిని కన్నా ఢీకొట్టగలరా ?

కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. ఆ నియోజకవర్గ ఎన్నికలు.. ఈసారి మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన.. మూడు పార్టీలు సత్తెనపల్లిని సవాల్‌గా తీసుకున్నాయ్. మూడు పార్టీలకు సవాళ్లు ఎదురవుతున్నాయ్. అంబటి రాంబాబును ఓడించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. అంబటి మీద కన్నా లక్ష్మీనారాయణను బరిలో దింపేందుకు సిద్ధం అవుతోంది. గత ఎన్నికల్లో కాపు వర్సెస్‌ కమ్మగా సాగిన రాజకీయ పోరు.. ఈసారి కాపు వర్సెస్‌ కాపు అన్నట్లు కనిపించబోతోంది. దీంతో కాపుల మనసు గెలిచేదెవరు.. కాపులు కాపు కాసేదెవరన్నది ఆసక్తికరంగా మారింది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 06:44 PM IST

సత్తెనపల్లిలో రాజకీయం విచిత్రంగా ఉంది. బలం కోల్పోయి టీడీపీ.. బలాన్ని నిలబెట్టుకోలేక వైసీపీ.. బలం లేక జనసేన.. ఇలా మూడు పార్టీల పరిస్థితి ఒకేలా ఉంది దాదాపుగా ! టీడీపీ టార్గెట్‌ చేస్తున్న లిస్టులో.. టాప్‌ 10లో ఉంటారు అంబటి రాంబాబు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అంబటిని ఓడించి తీరాలని టీడీపీ కంకణం కట్టుకుంది. అందుకే అంబటిని రంగంలోకి దించింది. తన మీద పోటీ చేయించేందుకు కొత్త వస్తాద్‌ని దింపుతున్నారని అంబటి ఇలా అన్నారో లేదో.. గంట వ్యవధిలో కన్నా పేరును ఖరారు చేస్తూ టీడీపీ నుంచి ప్రకటన వచ్చింది. అన్నీ తెలిసే అంబటి ఇలా అన్నారా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల యుద్ధం ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

అటు అంబటి.. ఇటు కన్నా.. ఇద్దరు కాపు వర్గానికి చెందిన నేతలే కావడంతో.. కాపులు ఎటు వైపు ఉంటారన్నది మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. సత్తెనపల్లిలో కాపు వర్గం ఓట్లు భారీగానే ఉన్నాయ్‌. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయం అయింది. ఇద్దరు కాపు నేతల మధ్య జరగబోయే యుద్ధంలో కాపులు ఎటు వైపు ఉంటారన్న టెన్షన్ అప్పుడే మొదలైంది. గతంలో పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కన్నాకు.. సత్తెనపల్లి మీద కూడా మంచి పట్టు ఉంది. ఈ మధ్యే బీజేపీకి బైబై చెప్పి టీడీపీలో చేరిన ఆయనకు.. గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది.

ఐతే ఇదేం ఖర్మ కార్యక్రమానికి చంద్రబాబు సత్తెనపల్లికి వచ్చినప్పుడు.. కన్నా ఆయన వెంటే కనిపించారు. అప్పుడే దాదాపు క్లారిటీ వచ్చేసింది. కోడెల మరణం తర్వాత.. సత్తెనపల్లికి కొత్త లీడర్‌ను పెట్టలేదు టీడీపీ. ఐతే కోడెల వారసుడు శివరాం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా రేసులో కనిపించారు. ఇద్దరు పోటీగా ఉండగా.. కన్నాకు అవకాశం కల్పించడం టీడీపీకి కలిసొస్తుందా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. వర్గపోరుకు దారి తీసి.. టీడీపీని దెబ్బ తీస్తుందా… లేదంటే జనసేన కాపు బలం మరింత యాడ్ అవుతుందా అనే చర్చ కూడా సాగుతోంది. గత ఎన్నికల్లో జనసేన తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసిన యర్రం వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం వైసీపీలో చేరారు. దీంతో ఫలితం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.