టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు.. టీ ట్వంటీ ప్రపంచకప్ విజయం మంచి జోష్ ఇచ్చినా వ్యక్తిగతంగా హిట్ మ్యాన్ ప్రదర్శన మాత్రం తేలిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు సొంతగడ్డపై కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవం మరింత ఒత్తిడి పెంచింది. తాజాగా అడిలైడ్ టెస్ట్ ఓటమితో విమర్శలు ఎక్కువయ్యాయి. వ్యక్తిగతంగా వైఫల్యాల బాటను వీడలేకపోతున్న రోహిత్ ఇక టెస్ట్ కెరీర్ కు కూడా గుడ్ బై చెప్పే టైమ్ వచ్చిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు సైతం హిట్ మ్యాన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్ కు అండగా నిలిచాడు.
రోహిత్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. జట్టును నడిపించడం సవాళ్లు ఉంటాయని, ఒకటి రెండు పేలవ ప్రదర్శన ఆధారంగా కెప్టెన్‌ను ప్రశ్నించాల్సిన అవసరం లేదని కపిల్ దేవ్ చెప్పాడు. రోహత్ చాలా ఏళ్లుగా ఎంతో చేశాడనీ, అతని మీద అనుమానాలు అక్కర్లేదన్నాడు. ఆసీస్ టూర్ లోనే తిరిగి ఫామ్ అందుకుంటాడని తాను భావిస్తున్నట్టు కపిల్ చెప్పుకొచ్చాడు.
. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ కు తన ఫామ్ చాలా ముఖ్యమన్నాడు. గతంలో బాగా ఆడినా ఒకటి రెండు వైఫల్యాల తర్వాత కొందరు విమర్శించడం ప్రారంభిస్తారని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. ఆరు నెలల క్రితం అతను టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు తనను ఎవరూ ఈ ప్రశ్న అడగలేదనీ కపిల్ గుర్తు చేశాడు. అతను రాణించకపోతే అక్కడ ఉండడని కపిల్ తేల్చేశాడు. రోహిత్ ఖచ్చితంగా పుంజుకుంటాడని, ఒక మంచి ఇన్నింగ్స్ తో అంతా నార్మల్ అయిపోతుందంటూ కపిల్ దేవ్ విశ్లేషించాడు.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా రోహిత్ ఎప్పుడు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా ఓటమిని చవిచూడాల్సి వస్తుంది.సిరీస్ మధ్యలో రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడల్లా భారత జట్టుపై ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తోంది.ఇలా జరగడ మొదటిసారి కాదు. రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడుసార్లు ఆస్ట్రేలియాతో మధ్య సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అన్ని సార్లూ జట్టుకు ఓటమే ఎదురైంది. అదే సమయంలో బూమ్రా కెప్టెన్ గా సక్సెసయ్యాడు. దీంతో రోహిత్ శర్మ వస్తే చాలు జట్టు ఓడిపోతుందనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది.