Dr. Ranganath: డాక్టర్ గా మారి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే..

వైద్యో నారాయణో హరి అని అంటారు. ఈ నానుడిని ఒక ఎమ్మెల్యే నిజం చేశారు. ఎమ్మెల్యే ఏంటి నిజం చేయడం ఏంటి అని ఆశ్చర్యంతో పాటూ వైద్యుని గురించి ముందుగా ఇక్కడ ఎందుకు ప్రస్తావించారు అనే సందేహం కలుగవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే కంటే ముందు ఆయన వైద్యుడు. అది కూడా ఆర్థోపెడిక్ లో మాస్టర్స్ చేసి ప్రజలకు సేవచేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన చేసిన సేవ ఇప్పుడు అతని రాజకీయ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా వెలిగేందుకు దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరో.. ఆయన చేసిన సేవ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - August 3, 2023 / 01:43 PM IST

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

తుమకూరు జిల్లా కుందూరు గ్రామానికి చెందిన ఆశా అనే మహిళ మోకాలి అలైన్‌మెంట్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ మహిళకు బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాకర్ట్ రంగనాథ్ స్వయంగా మోకాలి శాస్త్ర చికిత్స చేశారు. దీంతో ఆమె మనస్పూర్తిగా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలతో పాటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విష‍యం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు ఈ ప్రజా ప్రతినిధి. రంగనాథ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి బంధువు. మైసూరులోని జేఎస్ఎస్ మెడికల్ కాలేజీ నుంచి ఆర్థోపెడిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎంఎస్) పూర్తి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, నాకు సమయం దొరికినప్పుడల్లా నేను నా వృత్తిని అభ్యసిస్తాను. కోవిడ్ తర్వాత, నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసాను అని ఒక ప్రదాన స్రవంతి పత్రికకు తెలిపారు. తాజాగా ఆదివారం ఆశాకు చేసిన జాయింట్ ఆపరేషన్ రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత చేసిందని వివరించారు. ఆయుష్మాన్ భారత్ యోజన గురించి మాట్లాడుతూ.. ఆశా లాంటి వారికి వచ్చిన టెక్నికల్ సమస్యలతో పాటూ, మోకాలి, తుంటి సమస్యల శస్త్రచికిత్స గురించి కీలకమైన అంశాన్ని రానున్న అసెంబ్లీలో లేవనెత్తుతానన్నారు. ఒకసారి మాత్రమే ఆపరేషన్ చేస్తామనే పథకాలను సవరించేలా కృషిచేస్తానన్నారు.

మరో 23 మందికి ఉచితంగా ఆపరేషన్

ఇక పేద రైతు కుటుంబానికి చెందిన ఆశా  కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ ఇంట్లో పనిచేస్తున్నారు. గత 10 ఏళ్ళ క్రితం మోకాలి నొప్పితో బాధపడుతూ శాస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ యశస్విని పథకం కింద ఆపరేషన్ ఉచితంగా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సమస్య తలెత్తలేదు. గత కొన్ని నెలలుగా తీవ్రమైన మోకాలి సమస్యను ఎదుర్కొంటున్న సదరు బాధితురాలు. మరో సారి శస్ర్తచికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఉచిత పథకంలో భాగంగా ఒక వ్యాధికి రెండుసార్లు శస్త్రచికిత్సకు అనుమతి లేదు. పేషెంట్లు తమ డబ్బులు తామే చెల్లించి ఆపరేషన్ చేయించుకోవాలి. దీనికి చికిత్స కోసం పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించారు అక్కడ సుమారు రూ. 7 లక్షల వరకూ ఖర్చు అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ కొంత డబ్బును కూడా పొదుపు చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్ళారు. ఈమె ఆర్థిక పరిస్థితిని గుర్తించి తానే స్వయంగా ఆపరేషన్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈమెతో పాటూ ఇదే సమస్యతో బాధపడుతున్న 23 మంది మహిళలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేసేందుకు కుణిగల్ ఎమ్మెల్యే ముందుకొచ్చారు.

ఈ కాలంలో ఇంతటి ప్రజాసేవ చేసే ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు. అందులోనూ తన సొంత డబ్బు రూ. 1.87 ఇంప్లాంట్ కి ఖర్చు చేసి మరీ మహిళ సమస్యను ఆదరించే వారు ఎందరున్నారు. ఇతను నిజమైన ప్రజానాయకుడు, ప్రజా సేవకుడు అని ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.

T.V.SRIKAR