Karnataka Effect in Telangana: తెలంగాణ బీజేపీపై కర్ణాటక ఓటమి ఎఫెక్ట్‌.. ఇక్కడి నేతల ఆశలన్నీ ఆవిరయినట్లేనా?

కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు ఎంత ముఖ్యమో.. బీజేపీకి అంతకుమించి ! కర్ణాటక ఫలితాలను చూపించి.. పక్క రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో సత్తా చాటాలని కమలం పార్టీ వ్యూహాలు రచించింది. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. కన్నడనాట ఘోర పరాభవం పలకరించింది.

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 06:06 PM IST

ఏ దశలోనూ కాంగ్రెస్‌కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది బీజేపీ. కర్ణాటక ఫలితాలు ఏపీతో కంపేర్‌ చేస్తే తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేసీఆర్ జాతీయ వ్యూహాలు, రేవంత్ అడుగులు.. బీజేపీలో చేరికలు.. దాదాపు అన్నీ కర్ణాటక ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. ఈ రిజల్ట్‌ తెలంగాణ బీజేపీకి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో దెబ్బతీసినట్లు కనిపిస్తోంది.

కన్నడ నాట గెలిస్తే.. బీజేపీలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయొచ్చని బీజేపీ మొదటి నుంచి ప్రిపేర్ అయి ఉంది. ఇప్పుడీ ఓటమితో కన్ఫ్యూజన్ మొదలయ్యే అవకాశాలు ఉంటాయ్. ఇక కర్ణాటకలో గెలిస్తే తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచి చర్చ జరిగింది. పొంగులేటి, జూపల్లిలాంటి నాయకులు.. కర్ణాటక ఫలితాల కోసమే వెయిట్ చేస్తున్నారనే చర్చ జరిగింది. ఏ పార్టీ గెలిస్తే అందులోకి జంప్ చేయాలని వారు ఫిక్స్ అయ్యారనే ప్రచారం వినిపించింది.

ఈ ఇద్దరితో పాటు బీఆర్ఎస్‌లో అసంతృప్త నేతలు కూడా కర్ణాటక ఫలితాల ఆధారంగానే.. తర్వాత అడుగులు ఎటు అన్నది డిసైడ్ కావాలని ఫిక్స్ అయ్యారు. కర్ణాటకలో గెలిచి… తెలంగాణలో భారీగా చేరికలను ప్రోత్సహించాలని ప్లాన్ చేసిన బీజేపీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయ్. ఇదంతా వదిలిస్తే.. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల మధ్య మరే ఎన్నికలు లేవు. దీంతో అక్కడి ఓటర్ తీర్పు.. తెలంగాణలోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు తెలంగాణ పార్టీ నేతలను మరింత టెన్షన్ పెడుతోంది.