gobi manchurian: ఫుడ్ కలర్‌గా వాడే రోడమైన్-బిపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. ఇకపై.. అక్కడి ఏ హోటల్, రెస్టారెంట్‌లోనూ దీన్ని వాడకూడదు. రోడమైన్-బి కెమికల్‌ను ఆహార పదార్థాల తయారీలో వాడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు రావ్ హెచ్చరించారు. ఎవరైనా ఈ కెమికల్ వాడితే ఏడేళ్లు లేదా యావజ్జీవ శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
TTD BOARD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. వారి దర్శనాలపై పరిమితి
హోటల్స్, రెస్టారెంట్లపై అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా రోడమైన్-బి అనే ఈ కలర్‌ను గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ వంటి పదార్థాల తయారీలో వాడుతారు. ఇదొక హానికర రసాయన పదార్థం. దీన్ని టెక్స్‌టైల్ రంగంలో వస్త్రాలకు రంగులు పూసేందుకు వాడుతారు. అలాగే పేపర్ ఇండస్ట్రీలో వాడుతారు. ఈ కెమికల్ కొంచెం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కానీ, దీనికి లిక్విడ్ కలిపితే అది ఎరుపు, గులాబి రంగులోకి మారుతుంది. వస్త్రాలకు మాత్రమే వాడే ఈ కెమికల్‌ను కొందరు రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు, గోబి మంచూరియా వంటి ఇతర ఆహార పదార్థాల తయారీలో వాడుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ పని చేస్తున్నారు. అయితే, వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అనేక పరిశోధనల్లో తేలింది.
దీంతో ఇటీవలే ఈ కెమికల్‌పై పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధిస్తున్నాయి. ఇటీవల గోవాలో ఈ కెమికల్ వాడుతున్నందువల్లే ఏకంగా గోబీ మంచూరియాపైనే నిషేధం విధించారు. గత నెలలో తమిళనాడు ప్రభుత్వం కూడా దీనితో తయారు చేసే పీచు మిఠాయిని నిషేధించింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా రోడమైన్-బిపై నిషేధం విధించింది.