‘ఏజ్ లిమిట్’ !! ప్రతి దానికీ ‘ఏజ్ లిమిట్’ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వినియోగానికీ ‘ఏజ్ లిమిట్’ పెట్టాలని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం మంగళవారం రోజున (సెప్టెంబరు 19) అభిప్రాయపడింది. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సోషల్ మీడియాను ఉపయోగించడానికి కనీస వయసు 21 ఏళ్లు ఉంటే బాగుంటుందని పేర్కొంది. కొన్ని ఎంపిక చేసిన ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయాలనే కేంద్ర సర్కారు ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విట్టర్ కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌పై న్యాయమూర్తులు జీ నరేందర్, విజయకుమార్ ఏ పాటిల్‌లతో కూడిన కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ట్విట్టర్ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు.. న్యాయస్థానం ఆదేశాలను పాటించనందుకు రూ.50 లక్షల జరిమానా వేసింది.
మద్యం వినియోగానికి నిబంధనలు పెట్టిన విధంగానే..
ఈ కేసు విచారణ ముగింపు సందర్భంగానే సోషల్ మీడియా వినియోగానికీ ‘ఏజ్ లిమిట్’ పై కర్ణాటక హైకోర్టు బెంచ్ కీలక కామెంట్స్ చేసింది. వీలైతే.. సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేయడమే చాలా బెటర్ అని ధర్మాసనం అభిప్రాయపడింది. స్కూల్ దశలోనే పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని పేర్కొంది. మద్యం వినియోగానికి నిబంధనలు పెట్టిన విధంగా.. సోషల్ మీడియా వినియోగానికీ నిబంధనలు పెట్టాల్సిన అవసరముందని న్యాయస్థానం చెప్పింది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇకపై కొన్ని ఆన్‌లైన్ గేమ్స్ ను యాక్సెస్ చేసేందుకు యూజర్ ఆధార్, ఇతర పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనిపై స్పందించిన కోర్టు బెంచ్.. అటువంటి తనిఖీ ప్రక్రియను సోషల్ మీడియా వినియోగంలో ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర సర్కారును ప్రశ్నించింది.
వీడియో వెరిఫికేషన్ తో పాటు సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే..
సోషల్ మీడియాలో ఏజ్ లిమిట్ పై ప్రభుత్వపరమైన మార్గదర్శకాలు లేవు. కానీ సోషల్ మీడియాలో అకౌంట్ ను క్రియేట్ చేసే క్రమంలో ఏజ్ అడుగుతారు. 13 ఏళ్లలోపు ఏజ్ ఉన్నవాళ్ల అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషన్ ను ఆటోమేటిక్ గా తిరస్కరిస్తారు. TikTok, Instagram, Twitter, Pinterest, Kik, YouTube, Snapchat, Facebook సహా అన్ని సోషల్ మీడియా యాప్స్ లో ఈ నిబంధన ఉంది. అయినప్పటికీ తప్పుడు ఏజ్ ను సబ్మిట్ చేసి ఎంతోమంది 12 ఏళ్లవారు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. బ్రిటన్ లో 12 ఏళ్ల ఏజ్ వాళ్లలో దాదాపు 80 శాతం మందికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నట్లు ఓ సంస్థ సర్వేలో వెల్లడైంది. వయసును నిర్ధారించే సర్టిఫికెట్లను సబ్మిట్ చేయడంతో పాటు వీడియో వెరిఫికేషన్ చేయించుకోవాలనే నిబంధన పెడితే.. సోషల్ మీడియాలో ఏజ్ లిమిట్ నిబంధనను పక్కాగా అమలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు వినియోగించే యాప్స్ పై తల్లిదండ్రుల ట్రాకింగ్ ను పెంచేందుకు దోహదం చేసే ఫీచర్స్ ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ఆయా పేరెంట్స్ పై ఉంటుంది. పిల్లలు రోజూ ఇంటర్నెట్ లో ఎంతసేపు గడుపుతున్నారు ? ఏయే టాపిక్స్ ఎక్కువగా చూస్తున్నారు ? అనే దానిపై నిఘా పెట్టాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంటుంది. ఈ దిశగా పేరెంట్స్ లో చైతన్యం నింపేలా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.