తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత… లిక్కర్ స్కామ్ లో తీహార్ జైలు నుంచి ఇప్పట్లో బయటకు వచ్చేటట్లు కనిపించట్లేదు. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మాత్రమే తన ప్రతాపం చూపించింది. ఇక సిబిఐ కూడా తన సత్తా చాటడానికి సిద్ధమైంది. లిక్కర్ కేసులో ఎవరు ఎంత కొట్టేశారు… ఎవరు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు కవితతోనే చెప్పించడానికి సీబీఐ సిద్దమవుతోంది. తీహార్ జైల్లోనే ఆమెను ప్రశ్నించబోతోంది. అటు ఈడీ, ఇటు సీబీఐ పట్టు బిగించడంతో కవిత ఈ కేసు నుంచి బయటపడటం కష్టమే. అంతేకాదు ఈడీ కేసులో బెయిల్ సంపాదించినా… సీబీఐ కూడా కవిత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈడీ మనీలాండరింగ్ పై దృష్టి పెడితే… సీబీఐ లిక్కర్ స్కామ్ లో మొత్తం జరిగిన నేరంపై… దాని వెనుక ఉన్న కారణాలపై ఆరా తీయబోతోంది.
గతంలో 2G స్కామ్ లో కరుణానిధి కుమార్తె కనిమొళి రెండేళ్లకు పైగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా అదే విధంగా చాలాకాలమే జైల్లో ఉండక తప్పదేమో. సీబీఐ, ఈడీ పెట్టిన రెండు కేసుల్ని ఆమె ఎదుర్కోవాల్సిందే. కవితను అరెస్ట్ చేసిన ఈడీ… తీహార్ జైలుకు పంపింది. ఇప్పుడు సీబీఐ కూడా ఎంటరైంది. ఎమ్మెల్సీ కవిత కేసులో ఏం జరగబోతోంది? తీహార్ జైలులో ఉన్న ఆమెను సీబీఐ ఏం ప్రశ్నించబోతోంది? కొత్తగా బయటకొచ్చిన విషయాలపై ఆరాతీస్తుందా? ఇవన్నీ ఇప్పుడు జనం ఆసక్తిగా గమనిస్తున్నారు.
తీహార్ జైలులో కవితను లిక్కర్ స్కాం కేసులో విచారించి, ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని కోరుతూ పిటిషన్ వేసింది సిబిఐ. కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. జైల్లోకి ల్యాప్‌టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. లిక్కర్ కేసులో కవితను విచారించి, ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు CBI అధికారులు. వచ్చే వారం తీహార్ జైలులోనే ఆమెను సీబీఐ విచారించే అవకాశముంది. ఆప్‌కు ఇచ్చిన 100 కోట్ల రూపాయల వ్యవహారంపై ప్రశ్నించనుంది. లిక్కర్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ 2022 డిసెంబర్ 2న కవితకు సీబీఐ నోటీసులు పంపింది. కానీ ఆమె విచారణకు హాజరు కాలేదు.
ఇప్పుడు కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇవ్వడంతో.. ఈ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి? అనేది సీబీఐ పరిశీలిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆధారాలు లభిస్తే…. CBI కూడా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే… విచారించేందుకు అవకాశం ఉండకపోవచ్చనీ… అందుకే జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సమయంలోనే ప్రశ్నించేందుకు సీబీఐ… కోర్టు అనుమతి తీసుకుంది.
ఇక… కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ మాత్రం… కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోరుతోంది. బెయిల్ ఇస్తే… సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని… ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని వివరించింది. మరోవైపు.. బుచ్చిబాబు ఫోన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా కవితను సీబీఐ ప్రశ్నించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ ఎంక్వైరీ చేయబోతోంది.