ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలింది. జెడ్డా వేదికగా జరగబోయే మెగా ఆక్షన్ కోసం ఫ్రాంచైజీలన్నీ తమ తమ వ్యూహాలతో రెడీ అయ్యాయి. కొన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లో తక్కువ మొత్తం వెచ్చించి వేలంలో ఎక్కువ మొత్తంతో బరిలోకి దిగుతుంటే… మరికొన్ని స్టార్ ప్లేయర్స్ ను ముందే తీసుకుని వేలంలో యువ ఆటగాళ్ళపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ స్ట్రాటజీ మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సన్ రైజర్స్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు ఆ ఫ్రాంచైజీ ఓనర్ క్యావ్యా మారన్… గ్రౌండ్ లో తన టీమ్ ప్లేయర్స్ ను ఎంకరేజ్ చేస్తూ , క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో టీమ్ కంటే ఎక్కువగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. అభిమానులు ముద్దుగా కావ్యా పాపగా పిలుచుకునే ఈ లేడీ బాస్ వేలంలోనూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. దిగ్గజ క్రికెటర్లను సపోర్టింగ్ స్టాఫ్ లో ఎంపిక చేసుకున్న కావ్యా వేలానికి సంబంధించి వారితో ప్రతీ వ్యూహంలోనూ భాగమవుతూ ఉంటుంది. ప్రస్తుతం మెగా వేలం కోసం సన్ రైజర్స్ 45 కోట్లతో బరిలోకి దిగుతోంది. రిటెన్షన్ ప్రక్రియలో మొత్తం ఐదుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ వారి కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేసింది. హెన్రీచ్ క్లాసెన్ కోసం అత్యధికంగా 23 కోట్లు వెచ్చించిన సన్ రైజర్స్.. ప్యాట్ కమిన్స్ ను 18 కోట్లకు, అభిషేక్ శర్మ 14 కోట్లకు, ట్రావిస్ హెడ్రూ ను 14 కోట్లకు, తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఐదుగురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడంతో సన్‌రైజర్స్‌కు ఓ ఆర్‌టీఎమ్ ఆప్షన్ ఉంది. అయితే ఆ కార్డును అనామక ఆటగాళ్ల కోసమే ఉపయోగించాల్సి ఉంది. తన దగ్గరున్న 45 కోట్లతో కావ్యా పాప గరిష్టంగా 20 మంది.. కనిష్టంగా 18 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. గత సీజన్ మినీ వేలం తరహాలోనే ఆరెంజ్ ఆర్మీ ఓనర్ కావ్య మారన్ ట్రేడ్ మార్క్ లిస్ట్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మిడిలార్డ్‌లో సత్తా చాటే బ్యాటర్లు కావాలి. ఆ స్లాట్‌ను దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్‌తో భర్తీ చేయాలనే లక్ష్యంతో ఆరెంజ్ ఆర్మీ ఉంది. ఈ ఇద్దరు దక్కకపోతే.. అన్‌క్యాప్‌డ్ జాబితాలో అథర్వ టైడ్, నమన్ ధిర్, అభినవ్ మనోహర్‌లను తీసుకునే ఛాన్సుంది. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు బ్యాకప్ ఆల్‌రౌండర్లుగా అబ్దుల్ సమద్‌తో పాటు సమీర్ రిజ్వీని టార్గెట్ చేయనుంది.
ఇక బౌలింగ్ విభఆగంలో ప్యాట్ కమిన్స్‌కు తోడుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ వంటి భారత పేసర్ల కోసం సన్‌రైజర్స్ వేలంలో ప్రయత్నించేందుకు ఛాన్సుంది. నటరాజన్, ఆవేశ్ ఖాన్ కూడా ఆ ఫ్రాంచైజీకి మంచి ఆప్షన్సే. కానీ అర్ష్‌దీప్ సింగ్ వేలంలో సన్ రైజర్స్ కు దక్కడం కష్టమే. సన్ రైజర్స్ మనీ పర్స్ లో 45 కోట్లే ఉండడంతో స్టార్ ప్లేయర్స్ కోసం ఎక్కువ ప్రయత్నించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తక్కువ ధరకు వస్తారనుకుంటున్న షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ కోసం సన్‌రైజర్స్ గట్టిగా ప్రయత్నించొచ్చు. స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌లో బడ్జెట్ దృష్ట్యా సన్‌రైజర్స్ అకీల్ హోస్సేన్, పియూష్ చావ్లా, వానిందు హసరంగాల కోసం బిడ్ వేయవచ్చు. మిగిలిన ఆప్షన్స్ లో హైదరాబాద్ ఫ్రాంచైజీకి దేశవాళీ క్రికెటర్లే దక్కుతారని అంచనా వేస్తున్నారు.