Publicity Mania: పబ్లిసిటీ కోసం వందల కోట్ల ఖర్చు.. ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తున్నారు సార్ !

మంచికి పబ్లిసిటీ అవసరం లేదు.. పబ్లిసిటీ చేస్తే వచ్చినట్లు కనిపించేది మంచే కాదు.. అధికారంలో ఉన్న పార్టీలు.. అధికారం కోసం పోరాడుతున్న పార్టీలు.. గుర్తుంచుకోవాల్సింది ఇదే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - February 22, 2023 / 01:33 PM IST

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినా తప్పు లేదు కానీ… జనాల సొమ్మును.. జనం గెలిపించిన నాయకుడు ఇష్టానుసారంగా ఖర్చు చేయడం మాత్రం కచ్చితంగా తప్పే! జనాల నుంచి సొమ్ముల రూపంలో వసూలు చేసిన డబ్బులను.. ప్రభుత్వం అంటూ పార్టీ ప్రచారం కోసం ఖర్చు చేయడం అంతకన్నా పెద్ద తప్పు ! పోనీ ఖజానా నిండిపోయి కారిపోతుందా అంటే.. మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్న రేంజ్‌లో ఖర్చులు ఉన్నాయ్. ఇదీ తెలుగు రాష్ట్రాల గురించి జనాలు మాట్లాడుకుంటున్న మాట.

ఇటు కేసీఆర్, అటు జగన్.. ఇలాంటి ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటున్నారు. సొంత పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో మీడియాకు భారీ ప్రకటనలు ఇస్తున్నారు. బీజేపీ మీద యుద్ధం అని మొదలుపెట్టిన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నేషనల్ చానెల్స్‌లో వస్తున్న ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలో అదేదో అద్భుతం జరిగిపోతున్నట్లు బ్రహ్మండం బద్దలయిపోతున్నట్లు.. దేశానికి ప్రకటనల చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ చానెల్స్, పేపర్లలో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు వేయిస్తున్నారు. భారీ ప్యాకేజీలు మాట్లాడుకొని పదేపదే ప్రకటనలు వేయిస్తున్నారు.

నిజమే.. కేసీఆర్ పాలనలో అద్భుతమే జరుగుతుంది అనుకుందాం.. అది పార్టీ సొమ్ముతో కదా వేయించుకోవాలి.. జనాల సొమ్మును విచ్చలవిడిగా వాడడం ఏంటన్నది ఇప్పుడు మెజారిటీ జనాల ప్రశ్న ! గతంలోకి వెళ్లి చూస్తే.. ఇదే కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి ప్రకటనపై చేసిన లొల్లి అంతా ఇంతా కాదు.. జనాల సొమ్ము తగలబెడతారా అంటూ చిన్నపాటి యుద్ధమే చేశాడు అప్పటి ప్రభుత్వం మీద ! కట్‌ చేస్తే ఇప్పుడు కేసీఆర్‌ ఇప్పుడు చేస్తుందేంటనే ప్రశ్నకు కావాలి ఇప్పుడు సమాధానం.

కేసీఆర్ సంగతి ఇలా ఉంటే.. జగన్‌ కూడా ఖర్చు విషయంలో తగ్గేదే లేదు అంటున్నారు. ఉద్యోగులకు ఒకటి తారీఖు జీతాలు ఇవ్వడం రాదు కానీ.. ఇంగ్లీష్ పేపర్లకు ప్రకటనలు ఎందుకు సార్ అంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నలు పేలుతున్నాయ్. ప్రాంతీయ పార్టీలు.. తెలుగు రాష్ట్రాలు.. వీళ్లకు జాతీయ మీడియా మీద ఎందుకు ఇంత ఇంట్రస్ట్ ఎందుకో అర్థం కాదు. జనాలు కూడా ఈ విషయం గుర్తించాలి. ప్రకటనలకు వాళ్లు చేసే ఖర్చు.. మన పల్లెంలో గింజలు లాగేసుకున్నట్లే ! మన కష్టాన్ని వాడుకున్నట్లే.. మన చెమను దోచుకున్నట్లే ! మంచికి పబ్లిసిటీ అవసరం లేదు.. పబ్లిసిటీ చేస్తే వచ్చినట్లు కనిపించేది మంచే కాదు.. అధికారంలో ఉన్న పార్టీలు.. అధికారం కోసం పోరాడుతున్న పార్టీలు.. గుర్తుంచుకోవాల్సింది ఇదే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..