CM kcr: రైతులకు సంకెళ్లా..! కేసీఆర్ గారూ ఇదేనా రైతు సంక్షేమం అంటే..!

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం గురించి మాట్లాడినప్పుడల్లా అన్నదాతలపై ఆయన కురిపించే ప్రేమను చూసి ముచ్చటేస్తుంది. స్వయంగా రైతు కుటుంబం నుంచి రావడం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలుతూనే ఫామ్ హౌస్‌లో వ్యవసాయం చేయడం చూస్తే రైతుల గురించి ఇంతకంటే గొప్పగా ఆలోచించే నాయకుడు మరొకరు ఉంటారా అనిపిస్తుంది.

  • Written By:
  • Updated On - June 14, 2023 / 07:42 PM IST

కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు దశాబ్దాలుగా దేశాన్ని ఏలుతున్నా.. ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేయలేకపోయాయని.. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ దేశ వ్యాప్త ప్రచారం అందుకున్న ఘనత ఆయనది. అలాంటి కేసీఆర్ ఇలాకాలో రైతులకు సంకెళ్లు పడ్డాయి. అన్నదాతలకు సంకెళ్లు వేసి మరీ భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు . ఇంతకు మించిన అన్యాయం.. ఇంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉంటుందా సీఎం సాబ్..!

ప్రపంచంలో రైతులను ఉద్దరించే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పుకునే మీరు రైతులను కరుడుకట్టిన నేరగాళ్లలా చూడటం కరెక్టేనా.? వాళ్లేమైనా.. జనాన్ని దోచుకున్నారా.. హత్యలు చేశారా.. లేక రియల్ ఎస్టేట్ దందాలు చేశారా.. ? తమకు నష్టం జరగకుండా ఉండేందుకు రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చమని మాత్రమే కదా వాళ్లు కోరుకుంది.

అంతమాత్రానికే వాళ్లకు బేడీలు వేస్తారా ?
బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే.. మీ పార్టీ నేతలంతా కమలనాథులపై దుమ్మెత్తిపోసి..రైతులకు అండగా నిలిచారు కదా…దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్న మీరు వివిధ రైతుల సంఘాలను మీ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడారు కదా.. రైతుల విషయంలో అంతటి దయాహృదయంతో ఉండే మీ ప్రభుత్వం చిన్నపాటి ఆందోళన చేసిన కారణానికి ఇంతగా అవమానిస్తారా ? రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్న యాదగిరి, మల్లేశం, నిఖిల్, బాలనర్సింహలు అనే రైతులకు బేడీలు వేయడానికి మీ పోలీసులకు చేతులెలా వచ్చాయి. తీవ్రమైన నేరాలు చేసిన వారికి మాత్రమే బేడీలు వేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను మీ ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది ?

ఇలాంటి సందర్భాల్లోనే మీ ప్రభుత్వ పనితీరును గమనించే వాళ్లకు కొన్ని అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మీకు అనుకులంగా, మీరు చెప్పినట్టు వ్యవహరిస్తే రైతు సంఘాలైనా.. ఇంకెవరైనా వాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. మీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే మాత్రం వాళ్లు రైతులైనా.. నేరస్థులుగా మార్చేస్తారు. అంతటితో ఆగకుంటా బేడీలు వేస్తారు.

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చమని ఆందోళన చేసిన రైతులు ఎక్కడికైనా పారిపోతారా.. వారంతా భూమినే నమ్మకుని బతుకుతున్న అన్నదాతలు కదా.. కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తీసుకెళ్లే సందర్భంలో రైతులతో కాస్త మర్యాదగా ఉండాల్సింది కదా..! దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు చేసిన వాళ్లే యదేచ్ఛగా తిరుగుతున్న సమాజంలో తమకు న్యాయం చేయమని గళమెత్తిన రైతులు దొంగల్లా పారిపోతారని ఎందుకు అనుకున్నారు.

దేశవ్యాప్తంగా రైతు ఎజెండాను అమలు చేసే అబ్‌కిబార్..కిసాన్ సర్కార్ అంటున్న మీరు..మీ సొంత రాష్ట్రం లోని రైతులకే ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తే ఇక ఈ దేశం రైతులు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు ?