తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తునే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సారిగా రెండు నియోజకవర్గాల్లో పోటి చేస్తున్నారు. తన పాత నియోజకవర్గం అయిన గజ్వేల్ – కొత్త నియోజకవర్గం కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక తన సెంటిమెంట్ కొనసాగిస్తు అమృత ఘడియల్లో కేసీఆర్ రెండు చోట్ల నామినేషన్ వేశారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ కు వెళ్లారు సీఎం. మూడోసారి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తర్వాత గజ్వేల్ నుంచి కామారెడ్డి వెళ్లిన కేసీఆర్ తన రెండో నియోజవర్గంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. మధ్యాహ్నం కామారెడ్డిలో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
అటు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా తన నివాసంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసి తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి నామినేషన్ వేశారు. ఈ రోజు మంచి ముహూర్తం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల వ్యక్తులు ఈరోజే నామినేషన్ వేస్తున్నారు. రేపటితో నామినేషన్ల సమయం ముగుస్తుండటంతో పెద్ద సంఖ్యలో నేతలు భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు. ఇక కామారెడ్డిలో కేసీఆర్ పైన కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేస్తుంటే.. గజ్వేల్ లో బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు.