Mumps in kerala: కేరళలో గవద బిళ్లలు (మంప్స్) వ్యాధి కలవరపెడుతోంది. వందల మంది చిన్నారులు ఈ వ్యాధి బారినపడుతున్నారు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన ఒక్క రోజులోనే 190 మంది గవద బిళ్లల బారిన పడ్డారు. ఈ నెల పదో తారీఖులోపే 2,505కుపైగా కేసులు నమోదవ్వడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లలు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ వైద్యశాఖ సూచించింది.
geethanjali: నేనున్నా.. గీతాంజలి కూతుర్ని చూసి జగన్ ఎమోషనల్.. ఏం చేశాడంటే
గవద బిళ్లలును మంప్స్ లేదా ‘చిప్‌మంక్ చీక్స్’ అని కూడా పిలుస్తారు. పారామిక్సోవైరస్ అనే జాతికి చెందిన వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తుల్లో ఒళ్లు నొప్పులు, జ్వరం, అలసట, తలనొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. గవదబిళ్లలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాచిపోవడం వల్ల వారి చెంపలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఇలా అయినప్పుడు పిల్లలు ఏమీ తినలేరు, తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి ఈ వ్యాధి లక్షణాలు రెండు మూడు వారాల వరకు కనిపించకపోవచ్చు. కొందరిలో లక్షణాలు లేకపోవడం లేదా చాలా తేలికపాటి లక్షణాలు ఉంటాయి. ఇది ప్రమాదకర అంటువ్యాధి. దీనికి కూడా ఫ్లూ వంటి లక్షణాలే ఉంటాయి. వ్యాధి సోకిన వారి నోటి నుంచి వెలువడే నీటి తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ‘గవదబిళ్ల’ బారిన పడినవారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా రెండేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడతారు. మంప్స్- మీజిల్స్- రుబెల్లా (ఎంఎంఆర్) మూడు వ్యాధులకు కలిపి ఒక టీకా వేస్తారు. ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే టీకా వేసుకోవాలి. ఈ వ్యాధి సోకకుండా మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వాళ్లు త్వరగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గవద బిళ్లలు యాంటీబయాటిక్స్‌తో త్వరగా నయం కాదు. చికిత్స కొద్ది రోజులపాటు కొనసాగుతుంది.