తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో రెండు లోక్‌సభ (Lok Sabha Elections) సీట్ల మీద ఖాకీలు కన్నేశారట. ఎస్సీ రిజర్వ్ (SC Reserve) అయిన వరంగల్ పార్లమెంట్ (Warangal, MP Seats) స్థానం మీద మాజీలు కన్నేస్తే.. ఎస్టీకి రిజర్వ్ అయిన మహబూబాబాద్ నుంచి సర్వీస్‌లో ఉన్న అధికారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసిన నిజామాబాద్ మాజీ సీపీ నాగరాజు విజయం సాధించడంతో పోలీస్ అధికారుల కళ్ళు ఇప్పుడు లోక్‌సభ సీట్ల మీద పడ్డట్టు తెలిసింది.
సీఐ (CI) ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నారు దొమ్మాటి సాంబయ్య. ఈసారి వరంగల్ పార్లమెంట్ టికెట్ (Parliament ticket) కోసం పావులు కదుపుతున్నారాయన. 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ప్రజా ప్రతినిధిగా గెలవలేకపోయారు.
ఇక బీజేపీ తరపున యాక్టివ్ గా ఉన్న మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్ (Former DGP Krishna Prasad) సైతం వరంగల్ పార్లమెంట్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారట. హైదరాబాదులో స్థిరపడ్డ కృష్ణ ప్రసాద్… అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి ఇంచార్జిగా పనిచేశారు. ఈసారి ఎంపీ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారాయన. ఎస్సీ వర్గీకరణకు బిజెపి మద్దతిచ్చినందున ఈసారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారట కృష్ణప్రసాద్. అటు మహబూబాబాద్ ఎంపీ టిక్కెట్‌కు కూడా ఈసారి ఫుల్ డిమాండ్ వచ్చింది.ఇప్పటికే మాజీ ఎంపీ బలరాం నాయక్, సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఈ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
వారితో పాటు తాజాగా ఆ ఏరియాలో పనిచేసిన పోలీస్ అధికారులు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారట. డీఐజీ నాగరాజు రాజకీయాల్లోకి రావడానికి తన సర్వీసుకు రాజీనామా చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న నాగరాజు VRS కోసం దరఖాస్తు చేశారట. గవర్నమెంట్ స్టాంప్ పడగానే రాజకీయ అరంగేట్రం చేయడం కోసం పావులు కదుపుతున్నట్టు తెలిసింది. మహబూబాబాద్ ఏరియాలో ఎక్కువ కాలం పని చేయడం, అక్కడ గ్రిప్ ఉండడంతో సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నారు. గతంలో గుడుంబారహిత ప్రాంతంగా చేసిన అనుభవాన్ని గుర్తుచేస్తూ తాజా మీటింగ్స్ పెడుతున్నారట నాగరాజు. మరోవైపు మానుకోట పార్లమెంట్ బరిలో నిలిచేందుకు యువ పోలీస్ ఆఫీసర్ కాశీరాం సైతం పావులు కదుపుతున్నారట.
బలరాం, బెల్లయ్య పేర్లతోపాటు కాశీరామ్ పేరు కూడా కాంగ్రెస్ పెద్దల పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. కాశీరాంకి ఉస్మానియా స్టూడెంట్ లీడర్ గా తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అనుభవం ఉంది. విద్యావంతుడు, వివాదరహితుడన్న పేరు ప్లస్ అవుతుందని అంటున్నారు. గతంలో రెండు సార్లు ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారాయన. ప్రస్తుతం పీటీసీ వరంగల్‌లో ఇన్స్పెక్టర్‌గా ఉన్నారు. ఇలా ఇద్దరు సర్వీస్ ఆఫీసర్స్ ఈసారి మానుకోట రేస్‌లోకి రావడం ఆసక్తి రేపుతోంది. మరి ఖాకీ వదిలేసి ఖద్దర్ తొడగాలన్న వీరి ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరతాయో చూడాలి.