జలంధర్, మోఘాలాంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ కూడా బంద్ అయింది. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం మొత్తం కదిలివస్తోంది. దీంతో ఎవరీ అమృత్‌పాల్ సింగ్ అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. భింద్రన్‌వాలాతో ఎందుకు అతన్ని పోలుస్తున్నారు.. అమృత్‌పాల్ ఎందుకు పారిపోయాడు.. ఖలిస్థాన్ మూమెంట్ ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కనిపిస్తోంది. వారిస్ దే పంజాబ్ అనే సంస్థకు చీఫ్ అమృత్‌పాల్ సింగ్.. ఖలిస్థాన్ మద్దతుదారుల్లో ఒకడు. దుబాయ్‌లో ఉండేవాడు. వారిస్ దే పంజాబ్ వ్యవస్థాపకుడు దీప్‌సింగ్ యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత పంజాబ్‌లోకి ఎంటర్ అయ్యారు. తనకు తాను అధినేతగా ప్రకటించుకున్నాడు. ఖలిస్థాన్ ఉద్యమకారులకు దగ్గరయ్యాడు. దీంతో ముగిసిపోయిన అధ్యాయంగా ఉన్న ఖలిస్థాన్ ఉద్యమం ఇప్పుడు మళ్లీ ప్రారంభం అయింది.
తన అనుచరుడు లవ్‌సింగ్ అరెస్ట్ అయినప్పుడు అమృత్‌పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన అనుచరులతో ఏకంగా పోలీస్‌స్టేషన్ మీదే దాడి చేయించాడు. కేంద్రమంత్రి అమిత్‌షాను చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో.. అమృత్‌పాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఖలిస్థాన్ ఉద్యమం పేరుతో కొన్ని దశాబ్దాల కింద.. భింద్రన్‌వాలా ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. గోల్డెన్ టెంపుల్ కేంద్రంగా పంజాబ్‌లో సమాంతర ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేశాడు. భింద్రన్‌కు కాపీ అన్నట్లుగా ఇప్పుడు అమృత్‌పాల్ కనిపిస్తున్నాడు. వేషధారణ నుంచి సమాంతర పాలన సాగించాలన్న కోరిక వరకు.. కేంద్ర ప్రభుత్వం మీద మాటల వరకు.. భింద్రన్‌వాలాను తలపిస్తున్నాడు.
పంజాబ్ రాష్ట్రాన్ని మొత్తం కలిపేసి.. ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్నదే ఖలిస్థాన్ మద్దతుదారుల ప్రధాన నినాదం. నిజానికి బింద్రన్‌వాలా ఎప్పుడు ఖలిస్థాన్ అనే పదాన్ని వాడలేదు. కానీ అమృత్‌పాల్ సింగ్ మాత్రం తాను ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతుదారిడిని చెప్పేస్తాడు. ఖచ్చితంగా పంజాబ్‌ను కొత్త దేశంగా ఏర్పాటు చేసేందుకు పోరాడతానని చెప్పాడు. చాలాసార్లు తన ప్రసంగాల ద్వారా యువతను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యాడు అమృత్‌పాల్ సింగ్. ప్రస్తుతం అమృత్‌పాల్ సింగ్‌పై హేట్ స్పీచ్, కిడ్నాపింగ్ కలిపి మూడు కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో భాగంగానే అమృత్ పాల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు పంజాబ్ పోలీసులు. చిక్కినట్టే చిక్కి పోలీసుల చేతి నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఇప్పుడు పంజాబ్‌లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.