KHAMMAM MP: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొనసాగిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ ఎవరికి వాళ్లు వాళ్ల మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఆఖరికి రామసహాయం రఘురాం రెడ్డిని టికెట్ వరించింది. భట్టి, తుమ్మల లాంటి సీనియర్ నాయకులు ఉన్నా ఆయనకే టికెట్ ఇచ్చారంటే ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ప్రతీ ఒక్కరిలో ఆసక్తిగా మారింది.
YS JAGAN: అవినాష్ తప్పు చేయలేదన్న జగన్.. చెల్లెళ్ల ఫైర్
1961 డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు జన్మించారు రామసహాయం రఘురాం రెడ్డి. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ వీళ్ల స్వగ్రామం. హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకా, పీజీ డిప్లొమా చదువుకున్నారు రఘురాం రెడ్డి. రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు రఘురాం రెడ్డి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుతో వీళ్ల కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేది. సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ళచెర్వు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలకు, ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్ గా పనిచేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా, 1989, 1991లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు, వరంగల్ లోక్ సభకు ఇంచార్జ్‌గా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో రాజ్యసభకు, 2014లో ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా చివరి నిమిషంలో అవి వేరే వారిని వరించాయి. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. రఘురాం రెడ్డి 2011-2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యాటరన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్‌గా, హైదరాబాద్ రేస్ క్లబ్‌లో బోర్డు మెంబర్‌గా ఉన్నారు. రఘురాం రెడ్డితో పాటు వారి తాతముత్తాతలు సేవాదృక్పథ కుటుంబానికి చెందిన వారే. వాళ్ల ప్రాంతంలో రామసహాయం కుటుంబానికి చెందిన వందల కోట్ల విలువ చేసే భూములను ఉచితంగా ప్రభుత్వానికి రాసిచ్చారు. పీహెచ్‌సీలు, చేగొమ్మ హరిజన కాలనీకి కూడా సొంత స్థలాలను ఉచితంగా అందజేసింది రఘురాం రెడ్డి కుటుంబీకులే. వీళ్ల కుటుంబానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఖమ్మం టికెట్ రఘురాం రెడ్డికి దక్కింది.