Killi Krupa Rani: ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు. వైసీపీ కోసం కష్టపడి పనిచేసిన తనకు పార్టీలో సరైన గుర్తింపు లేని కారణంగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృపారాణి తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. పార్టీలో తనను అవమానించారని, టెక్కలి నియోజకవర్గంలో తనని అణచి వేసేందుకు కుట్రలు చేశారని కృపారాణి ఆరోపించారు.
Prabhas: బాహుబలి సెంటిమెంట్.. కల్కి కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
2009లో కృపారాణి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో టీడీపీ దిగ్గజ నేత ఎర్రన్నాయుడుని ఓడించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. తర్వాత 2014లో రామ్మోహన్ నాయుడు (టీడీపీ) చేతిలో ఓడిపోయారు. తర్వాత 2019లో వైసీపీలో చేరారు. అదే సంవత్సరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు. అయితే, రాజ్యసభ సీటు ఆశించినప్పటికీ దక్కలేదు. ఆ తర్వాత నుంచి క్రమంగా వైసీపీలో ఆమె ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అయితే, తాజా ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాలని భావించారు. కానీ, జగన్ ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా అయినా పోటీ చేసే అవకాశం దక్కుతుందేమోనని కృపారాణి అనుకున్నారు. కానీ, ఈ టిక్కెట్ కూడా దక్కలేదు. అటు అసెంబ్లీ.. ఇటు పార్లమెంట్.. ఎక్కడా జగన్.. కృపారాణికి సీటు ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన కృపారాణి కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బుధవారం తన రాజీనామా సమర్పించారు. దీంతో ఆమె టీడీపీ వైపు వెళ్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ తరఫున టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. లేదా శ్రీకాకుళం ఎంపీ సీటులో పోటీ చేయొచ్చని సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో కృపారాణి చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన ప్రకారం.. ఆమె శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేస్తే.. ఆమె కుమారుడు అసెంబ్లీకి పోటీ చేయొచ్చు.