ప్రజలంతా అభిమానంగా కిషనన్న అని పిలిచే గంగాపురం కిషన్ రెడ్డి (Kishan Reddy)… కఠిన పరిశ్రమ, అంకితభావంతో ఈ స్థాయికి ఎదిగారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా పనిచేసుకొని పోవడం కిషన్ రెడ్డి బలం. 2019లో మొదటిసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. అంతకుముందు మూడుసార్లు ఎమ్మెల్యేగా, బీజేపీ పక్షనేతగా బాధ్యతలు నిర్వహించారు.
జనతాపార్టీ యువమోర్చా (Janata Party Yuva Morcha) నాయకుడిగా కిషన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1980లో బీజేపీ (BJP) ఏర్పాటైనప్పటినుంచీ పార్టీలో కొనసాగుతున్నారు. సాధారణ కార్యకర్తగా మొదలుపెట్టి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ… పార్టీకి సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాధ్యతలను నిర్వహించారు. కిషన్ రెడ్డి రాజకీయ జీవితంలో.. చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ఉద్యమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన పోరాటంతోనే వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు జరిగాయి. తెలంగాణ హోంగార్డ్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా.. హోంగార్డుల హక్కుల కోసం పోరాడారు. RSS నేర్పిన క్రమశిక్షణ, జాతీయవాదంపై ఆకర్షణతో కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సాగింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ యూత్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర మంత్రిగా అనేక విదేశీ కార్యక్రమాల్లోనూ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 2023 జూలై నుంచి నాలుగోసారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ బాగా పుంజుకుంది. దీనికి తోడు లోక్ సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో తెలంగాణకు ప్రియారిటీ ఇచ్చింది బీజేపీ హైకమాండ్.