మమ్మల్ని లైట్ తీసుకోవద్దు,భారత్ కు కివీస్ కెప్టెన్ వార్నింగ్

భారత్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెడీ అవుతోంది. ఇటీవల శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన కివీస్ వచ్చే వారం భారత్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కు ముందే కివీస్ సారథ్య బాధ్యతల నుంచి పేస్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నాడు.

  • Written By:
  • Publish Date - October 12, 2024 / 04:09 PM IST

భారత్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెడీ అవుతోంది. ఇటీవల శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన కివీస్ వచ్చే వారం భారత్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కు ముందే కివీస్ సారథ్య బాధ్యతల నుంచి పేస్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నాడు. టిమ్ సౌథీ స్థానంలో న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్‌గా టామ్ లాథమ్ ఎంపికయ్యాడు.ఓపెనర్ గా కివీస్ కు కీలక ఆటగాడిగా ఉన్న లాథమ్ ఇప్పటి వరకూ 82 టెస్టులు, 147 వన్డేలు, 26 టీ ట్వంటీలు ఆడాడు. భారత పర్యటనపై లాథమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమను తేలిగ్గా తీసుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. టెస్ట్ ఫార్మాట్ లో తాము క్వాలిటీ క్రికెట్ ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు.

భారత్ గడ్డపై క్రికెట్ ఆడటం అంటే మా జట్టుకు సవాలేనని అంగీకరించిన లాథమ్ దూకుడే వ్యూహంగా బరిలోకి దిగుతామని చెప్పుకొచ్చాడు. టీమిండియాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. దూకుడుగా ఆడుతూ భారత్ ను ఒత్తిడిలోకి నెట్టాలని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడే అన్ని విషయాలు చెప్పడం కంటే గ్రౌండ్ లో ఎలా ఆడాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామన్నాడు. ఇదిలాఉంటే..న్యూజిలాండ్ భారత్ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ ను గెలవలేదు. 1955-56 నుంచి స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ ఓడిపోలేదు. చివరిసారిగా 2021లో ఇక్కడకు వచ్చిన కివీస్ పై భారత్ రెండు మ్యాచ్ లసిరీస్ ను 1-0తో గెలుచుకుంది. కాగా తొలి టెస్టుకు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమవడం కివీస్ కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. మిగిలిన సిరీస్ కు కూడా అతను అందుబాటులో ఉండడంపైనా సందిగ్ధత నెలకొంది.

ఇదిలా ఉంటే శ్రీలంక పర్యటనలో న్యూజిలాండ్ ఘోరపరాభవాన్ని చవిచూసింది. రెండు టెస్టుల్లోనూ ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆరోస్థానానికి పడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ పై సిరీస్ విజయం ఆ జట్టుకు తప్పనిసరి. అయితే సొంతగడ్డపై తిరుగులేని ఫామ్ తో ఉన్న రోహిత్ సేనను ఓడించేందుకు కివీస్ అంచనాలకు మించి రాణించాల్సిందే. ఇటీవలే బంగ్లాను వైట్ వాష్ చేసిన టీమిండియా కివీస్ పై సిరీస్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తుకు మరింత చేరువవుతుంది. కాగా భారత పర్యటనలో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుండగా.. తొలి టెస్ట్ బెంగళూరు వేదికగా అక్టోబర్ 16 నుంచి మొదలవుతుంది.