లక్నో, రాహుల్ తెగతెంపులు రిటెన్షన్ లిస్ట్ ఇదే

అనుకున్నట్టే జరిగింది...లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు గుడ్ బై చెప్పేసింది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్న వేళ లక్నో రిటైన్ లిస్ట్ కూడా రెడీ అయింది. నిజానికి రాహుల్ తో లక్నో విడిపోతున్నట్టు నాలుగు నెలల ముందు నుంచే వార్తలు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - October 28, 2024 / 07:08 PM IST

అనుకున్నట్టే జరిగింది…లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు గుడ్ బై చెప్పేసింది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్న వేళ లక్నో రిటైన్ లిస్ట్ కూడా రెడీ అయింది. నిజానికి రాహుల్ తో లక్నో విడిపోతున్నట్టు నాలుగు నెలల ముందు నుంచే వార్తలు వచ్చాయి. గత సీజన్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్ పై మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి నుంచే ఫ్రాంచైజీకి, రాహుల్ కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇటీవల రాహుల్, లక్నో ఫ్రాంచైజీ ఓనర్ తో సమావేశమైనప్పుడు కూడా రిటెన్షన్ పై మాత్రం క్లారిటీ రాలేదు. అదే సమయంలో లక్నో కొత్త మెంటార్ జహీర్ ఖాన్ అతని స్ట్రైక్ రేట్ పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో చివరికి రాహుల్ ను వదిలేయాలని సూపర్ జెయింట్స్ నిర్ణయించుకుంది. కెఎల్ రాహుల్ ఐపీఎల్ కెరీర్ ను చూస్తే ఇప్పటి వరకూ 132 మ్యాచ్ లలో 4683 పరుగులు చేశాడు. దీనిలో 4 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలున్నాయి.

రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లతో పాటు ముగ్గురు స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోనుంది. లక్నో రిటైన్ జాబితాను చూస్తే మొదటి ప్రాధాన్యతగా నికోలస్ పూరన్ ను 18 కోట్లకు కొనసాగించుకోనుంది. గత కొంతకాలంలో టీ20ల్లో పూరన్ దుమ్మురేపుతున్నాడు. టీ ట్వంటీ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డులు కూడా బద్దలుకొడుతున్నాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్‌గానూ సత్తాచాటే పూరన్రి నుటైన్ లిస్ట్‌లో తమ ప్రథమ ఎంపికగా ఖరారు చేసింది. అలాగే స్పిన్నర్ రవి బిష్ణోయ్ జాక్ పాట్ కొట్టాడు. లక్నో అతన్ని రెండో ప్రాధాన్యతగా రిటైన్ చేసుకుంది. అంటే 14 కోట్లు బిష్ణోయ్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మయాంక్ యాదవ్ కూడా 11 కోట్లు అందుకోబోతున్నాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ను లక్నో మూడో రిటెన్షన్ గా ఖాయం చేసుకుంది.

కాగా, లక్నో ఫ్రాంచైజీ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మోహ్షిన్ ఖాన్, ఆయుష్ బదోని రిటైన్ చేసుకోవడానికి నిర్ణయించుకుంది. ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. దీంతో లక్నో తమ పర్స్ వాల్యూను వ్యూహాత్మకంగా మిగుల్చుకుంది. నాలుగు, ఐదు రిటైన్ ఎంపికలను వదిలేసి ఆ స్థానాల్లో అన్ క్యాప్డ్ కేటగిరీలో ఇద్దరిని తీసుకుంది. ఇక ఆల్ రౌండర్ స్టోయినిస్‌ను రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా దక్కించుకోవాలని లక్నో భావిస్తోంది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్ వేలంలోకి రానుండడంతో పలు ఫ్రాంచైజీలు ఇతన్ని కొనేందుకు ఎదురుచూస్తున్నాయి. రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు అక్టోబర్ 31 డెడ్ లైన్ గా నిర్ణయించారు. ఇక ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరి వారంలో విదేశాల్లో జరగబోతోంది.