ఐపీఎల్ మెగావేలం ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు తమ కొత్త కెప్టెన్, జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. వచ్చే సీజన్ లో పలు జట్లకు కొత్త సారథులు రాబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ సైతం కొత్త కెప్టెన్ తోనే వచ్చే సీజన్ లో బరిలోకి దిగబోతోంది. ప్రస్తుత ఛాంపియన్ కావడంతో కేకేఆర్ పై భారీ అంచనాలున్నాయి. అయితే కెప్టెన్సీ విషయంలో కోల్ కత్తా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వేలంలో వెంకటేశ్ అయ్యర్ ను 23.75 కోట్లు పెట్టి తిరిగి జట్టులోకి తీసుకుంది. దీంతో కేకేఆర్ కొత్త కెప్టెన్ అతనే అని ప్రచారం జరిగింది. కానీ, ఫ్రాంచైజీ అనుభవజ్ఞుడైన అజింక్యా రహానెకు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. రహానెను కెప్టెన్సీ కోసమే కొనుగోలు చేసిందని, ప్రస్తుతానికి 90 శాతం కొత్త కెప్టెన్ అతనే అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వేలంలో మొదట రహానె కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఆఖరి రౌండ్‌లో అతన్ని కనీస ధరకే కోల్ కత్తా కొనుగోలు చేసింది. సారథిగా రహానె అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది.అంతర్జాతీయ క్రికెట్ కు సంబంధించి ఆసీస్ టూర్ లో భారత జట్టుకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందించిన ఘనత రహానేకే దక్కుతుంది. అప్పటి కెప్టెన్ కోహ్లీ లేకపోవడంతో కంగారూ గడ్డపై భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. అలాగే రెడ్ బాల్ ఫార్మాట్‌లో ముంబైకి రహానె కెప్టెన్.గత సీజన్‌లో అతని నాయకత్వంలో ముంబై రంజీ ట్రోఫీ గెలిచింది. ముంబైకి ఇరానీ కప్ కూడా అందించాడు.కానీ టీ20ల్లో కెప్టెన్‌గా రహానెకు గొప్ప రికార్డేం లేదు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించింది. అలాగే, ఐపీఎల్‌లో 2018, 2019 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించాడు. 24 మ్యాచ్‌ల్లో కేవలం 9 విజయాలే అందుకున్నాడు. అయితే, రహానె అనుభవంపై కేకేఆర్ నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రహానే గత సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్ ప్లేయర్ గా ఉన్న ముద్రను పోగొట్టుకునే ప్రయత్నంలో దూకుడుగా ఆడుతున్నాడు. రహానే ఇప్పటి వరకూ 185 మ్యాచ్ లలో 4642 పరుగులు చేశాడు. రహానే ఐపీఎల్ కెరీర్ లో రెండు శతకాలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి. వచ్చే సీజన్ లో కోల్ కత్తాకు రహానే సారథ్యం వహించడం దాదాపు ఖాయమైనట్టేనని అంచనా వేస్తున్నారు. అయ్యర్ పై కెప్టెన్సీ ఒత్తిడి పడకుండా అతన్ని ఆల్ రౌండర్ గా జట్టుకు ఉపయోగించుకోవాలని కోల్ కత్తా ఫ్రాంచైజీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.