KTR-HARISH RAO: బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్తున్న నేతలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నేతలంతా పార్టీకి ద్రోహం చేసి వెళ్తున్నారని, తిరిగొచ్చి కాళ్లు మొక్కినా మళ్లీ చేర్చుకోం అంటున్నారు. హైదరాబాద్‌లో కేటీఆర్, దుబ్బాకలో హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మారే నేతలపై ఆగ్రహం విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. “మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి ఇద్దరూ కూడా కలిసి నమ్మించి మోసం చేశారు. పార్టీ మారటం లేదని చెబుతూనే.. కాంగ్రెస్ లోకి వెళ్లారు.
Raghu Rama Krishnam Raju: నరసాపురం టికెట్‌పై రఘురామ ధీమా.. చంద్రబాబుతో మైండ్‌గేమ్ ఆడుతున్నాడా..?
ఇద్దరూ కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థులు అయ్యారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్లీ రానియ్యం. పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు. వాళ్ళు చేస్తున్న విమర్శలను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. కేసీఆర్ కూతురు అరెస్టైన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్‌లోకి వెళ్లిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నారా.. లేదా మోడీ కోసం పని చేస్తున్నారో చెప్పాలి. నాయకులు పార్టీని వదిలేసినా.. పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా. కార్యకర్తల కోసం నేనుస్వయంగా వస్తా” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దుబ్బాకలో జరిగిన మీటింగ్‌లో హరీష్ రావు మాట్లాడారు. ”కాంగ్రెస్.. కొంతమంది నాయకులను కొనొచ్చుగాని ఉద్యమకారులను, బీఆర్ఎస్ కార్యకర్తలను, ప్రజలను కొనలేదు. కష్టకాలంలో బీఆర్ఎస్‌కు పార్టీకి ద్రోహం చేసినోళ్లు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే. పోయినవాళ్లు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలో చేర్చుకోం. 6 గ్యారంటీలు అమలుచేసే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తం.
దుబ్బాకకు సాగునీరు, తాగునీరు తెచ్చింది బీఆర్ఎస్. కానీ, కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ అబద్ధాలను, మోసాలనే ప్రజల్లోకి తీసుకెళ్లి అర్థం చేయించండి. ప్రజలు మోసపోకూడదు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఏదో జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 6 గ్యారంటీలు అమలుచేసే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తం. కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తం. రేవంత్ ఇంకా ప్రతిపక్ష నాయకుడిలాగే మాట్లాడుతున్నాడు. మానవబాంబులా కాదు, మానవీయంగా ప్రవర్తించు రేవంత్. దుబ్బాక బై ఎలక్షన్లలో బూటకపు హామీలిచ్చి గెలిచిన రఘునందన్ రావు కూడా మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. నిరుద్యోగ భృతి, రెండు ఎడ్లు, నాగలి ఏవేవో ఇస్తామని మాట తప్పిండు. ఇది శిశిరకాలం. పనికిరాని ఆకులు పోతాయి, కొత్త చిగురు వస్తుంది” అని హరీష్ రావు అన్నారు.