KTR: ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌పై ప్రజల తిరుగుబాటు.. కాంగ్రెస్‌వి 420 హామీలు: కేటీఆర్

ఎన్నికలకు ముందు అదానీని రేవంత్ రెడ్డి విపరీతంగా తిట్టారు. ప్రధాని మోదీ.. అదానీకి దేశ సంపదను దోచి పెడుతున్నారని రేవంత్ విమర్శలు చేశారు. ఇప్పుడు దావోస్‌ సాక్షిగా అదానీతోనే అలయ్ బలయ్ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 08:28 PM IST

KTR: ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని, కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్, తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. “ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్‌ 420 హామీలను ప్రజలకు ఎప్పుడూ గుర్తు చేయాలి.

Ayodhya Ram Mandir: భారీ భద్రత మధ్య అయోధ్య.. పదివేల మందితో బందోబస్తు

కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలి. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడేమో దశలవారీగా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారు. ఎన్నికలకు ముందు అదానీని రేవంత్ రెడ్డి విపరీతంగా తిట్టారు. ప్రధాని మోదీ.. అదానీకి దేశ సంపదను దోచి పెడుతున్నారని రేవంత్ విమర్శలు చేశారు. ఇప్పుడు దావోస్‌ సాక్షిగా అదానీతోనే అలయ్ బలయ్ అవుతున్నారు. బీజేపీ ఆదేశాలతోనే అదానీతో రేవంత్‌రెడ్డి కలిసి పని చేస్తున్నారు. ఎరువుల కోసం రైతులు లైన్‌లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించింది. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించాం.

పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. బీఆర్ఎస్ పార్టీయే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.