KTR: మీడియా సంస్థలు వెల్లడిస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంతా న్యూసెన్స్ అని, మళ్లీ తామే అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడతామన్నారు మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుబట్టారు. “ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ పర్సంటేజ్ తెలియకుండా ఎగ్జిట్ పోల్స్ ఎలా ప్రకటిస్తారు. నేషనల్ మీడియా గతంలో కూడా తప్పుడు సర్వేలు ప్రకటించింది. కొన్ని మీడియా సంస్థలు సరిగ్గా సర్వేలు చేయవు.
KCR: కామారెడ్డిలో కేసీఆర్‌కు ఓటమి తప్పదా.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఇదే..!
ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో ఐదు మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఒక్కటే నిజమైంది. మళ్లీ మాదే అధికారం. హ్యాట్రిక్ కొడతాం. ఎగ్జిట్ పోల్స్ మాకు కొత్త కాదు. మేం మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ పార్టీ 70కి పైగా సీట్లలో గెలుస్తుంది. 2018లో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలాయి. ఎగ్జిట్ పోల్స్ అంతా న్యూసెన్స్.. నాన్సెన్స్. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరూ కన్‌ఫ్యూజ్ కావొద్దు. కంగారు పడొద్దు. ఎన్నికల్లో గత 90 రోజులుగా కష్టపడిన పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే ఎగ్జిట్ పోల్స్ ఏంటి..?
ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాళ్లు డిసెంబర్ 3న ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా..? శుక్రవారం ఉదయానికి ఫైనల్ పోల్ రిజల్ట్ వస్తుంది. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.