తెలంగాణలో అధికారంలో ఉన్న 10యేళ్ళల్లో ఏనాడూ గ్రామపంచాయతీ (Gram Panchayat) సర్పంచ్ (Sarpanch) ల గోసను పట్టించుకోలేదు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం (KCR Government). కానీ ఇప్పుడు దిగిపోయాక.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సడన్ గా సర్పంచ్ ల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వాళ్ళ బిల్లుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతా అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. సర్పంచ్ ల తరపున గొంతు విప్పుతా అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తుండటంతో.. సర్పంచ్ లే కాదు.. తెలంగాణ జనం కూడా ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన (BRS Rule) ఉన్నంతకాలం గ్రామపంచాయతీల సర్పంచులు చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లెవల్లో కూర్చొని కేసీఆర్, మంత్రులు కొత్త పథకాలను ప్రవేశపెట్టడం.. నిధులు ఇచ్చినా.. ఇవ్వకున్నా.. వాటిని అమలు చేయాలని గ్రామస్థాయిలో పంచాయతీ సర్పంచ్ ల మీద ఒత్తిడి చేయడం కామన్ గా మారాయి. ప్రభుత్వ నిధులు రాకపోవడంతో చాలామంది సర్పంచ్ లు తమ సొంత ఖర్చులతోనే పనులు చేయించారు. మరికొందరు అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి.. వర్క్స్ చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందా.. చేయలేదా అన్నది తెలిసి కూడా.. కొందరు కలెకర్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు.. సర్పంచ్ ల మీద జులుం ప్రదర్శించారు. సస్పెండ్ చేస్తామని బెదిరించారు. ఈ విషయంలో అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కొంచె ఎక్కువే చేశారన్న ఆరోపణులున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 60 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అప్పట్లో పీసీసీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాక.. పనులు కాకపోతే ఉన్నతాధికారుల బెదిరింపులు.. అధిక వడ్డీలకు తీసుకొచ్చిన అప్పులను తిరిగి చెల్లించలేక.. ఆర్థిక ఇబ్బందులతో కొందరు సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు తమ ఆస్తులు, భార్యల పుస్తెలు కూడా అమ్ముకొని అప్పులు, వడ్డీలకు కట్టారు. ఒకానొక దశలో కేంద్రం గ్రామపంచాతీయలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను కూడా.. వేరే పథకాలకు మళ్ళించింది అప్పటి KCR ప్రభుత్వం. బీజేపీ, కాంగ్రెస్ నేతల అభ్యంతరంతో మళ్ళీ సర్పంచ్ ల ఖాతాల్లోకి వేసింది.
BRS ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.. సర్పంచ్ ల ఆత్మహత్యలకు ఎందుకు కారణం అయ్యారో.. కేటీఆర్ ఇచ్చిన వివరణ మరీ విడ్డూరంగా ఉంది. తమ ప్రభుత్వంలో చేద్దాం అనుకున్నా.. కరోనా వల్ల కొంత కిందా.. మీద అయ్యింది.. అందుకే ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి.. లేకపోతే సర్పంచ్ ల గొంతుక అయి BRS పోరాడుతుందని చెబుతున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సడన్ గా సర్పంచ్ ల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అంటే.. ఇప్పటికే మున్సిపాలిటీలన్నీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు టర్న్ అవుతున్నాయి. పాలక వర్గాలు మారిపోతున్నాయి.
ఇక ఫిబ్రవరి ఫస్ట్ కి సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తోంది. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. కొన్నాళ్ళ పాటు గ్రామపంచాయతీలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్ళిపోతాయి. నిధులు ఇవ్వక అప్పులపాలు జేసిన బీఆర్ఎస్ పై రాష్ట్రంలోని చాలామంది సర్పంచులు ఆగ్రహంగా ఉన్నారు. దాంతో వాళ్ళంతా కాంగ్రెస్ లోకి మారే ఛాన్సుంది. అంటే గులాబీ పార్టీకి సెకండ్ కేడర్ మొత్తం.. హస్తం పార్టీలోకి జంప్ అయ్యే అవకాశముంది. ఈ పరిస్థితిని కనిపెట్టిన కేటీఆర్.. ఇప్పుడు కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. పల్లెల దిశ, దశ మార్చినట్టు కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నా.. అప్పట్లో సర్పంచ్ ల ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మంత్రుల మాటలను జనం మాత్రం ఇంకా మర్చిపోలేదని కేటీఆర్ గుర్తుంచుకోవాలని అంటున్నారు.