KTR ON PHONE TAPPING: హీరోయిన్లను బెదిరించలేదు.. ఢిల్లీకి డబ్బులు పంపడంపైనే రేవంత్ దృష్టి: కేటీఆర్

హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడారు. అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. అడ్డగోలుగా మాట్లాడితే ముఖ్యమంత్రిని కూడా వదిలి పెట్టేది లేదు.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 02:32 PM IST

KTR ON PHONE TAPPING: ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, హీరోయిన్లను తాను బెదిరించలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై స్పందించారు. “ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. హీరోయిన్లతో కూడా సంబంధం లేదు. హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడారు. అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు.

Indian constitution : భారత రాజ్యాంగం మార్చనున్న మోదీ…? భారతదేశానికి 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు..?

అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. అడ్డగోలుగా మాట్లాడితే ముఖ్యమంత్రిని కూడా వదిలి పెట్టేది లేదు. గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పటి కాంగ్రెస్ నేతలు గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేశారు. వాటన్నింటిపై కూడా విచారణ చేయించాలి. చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ టాపింగ్ వ్యవహారాల పైన విచారణ చేపట్టాలి. అప్పటి ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ అధికారులకూ బాధ్యత ఉంటుంది కదా. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్‌ జరిగితే ఈ అధికారులకు తెలియదా..? మహిళలు రోడ్లపై ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల గురించి మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి. తాగునీటి ఇబ్బందులు రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలి.

హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చండి. ప్రజల గురించి పట్టించుకోకుండా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చేరికలపై దృష్టి పెట్టింది. 50 ఏళ్ల పాటు హైదరాబాదు నగరానికి తాగునీటి కొరత రాకుండా చేశాం. కనీసం వాటి నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కాదు. వాటర్ ట్యాపింగ్‌పైన దృష్టి పెట్టండి. కెసీఆర్ ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాద్‌లో ట్యాంకర్ల హడావిడి మొదలైంది. తెలంగాణలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయింది. ఈరోజు దాదాపు రెండు లక్షల 30 వేల ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న ముఖ్యమంత్రి అసలు ట్యాంకర్లతోని నీరు ఎందుకు సరఫరా చేయాల్సి వస్తుందో అది ప్రభుత్వ వైఫల్యం కాదా అనే విషయాన్ని చెప్పాలి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యల వివరాలను రేవంత్ రెడ్డికి నేరుగా పంపిస్తాం. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి 25 లక్షలు ఇచ్చి అదుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే మళ్లీ పంప్ హౌస్‌లు ఎట్లా ప్రారంభమైనయ్.. నీళ్లు ఎట్ల ఎత్తిపోస్తున్నారు..? పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.