తెలంగాణ ఎన్నికల్లో పరాజయం పాలై… హ్యాట్రిక్ చేజారిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. 10యేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బహిరంగంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కేటీఆర్ మాత్రం ప్రజా తీర్పును గౌరవిస్తాం… కొత్త ప్రభుత్వానికి సహకరిస్తాం అంటూ ఫలితాలు వెల్లడైన రోజు ప్రకటించారు. అయితే బుధవారం సిరిసిల్లలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలతో మాట్లాడిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామని చెబుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు. ఈ ఎన్నికల ఫలితాలను పాఠంగా తీసుకొని మళ్ళీ పుంజుకుంటామని ధీమాగా చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్… బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన కేటీఆర్ … ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే… ఇది స్వల్ప కాలమే అన్నారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు వస్తుంటాయి… అది సహజం… అంత మాత్రాన నిరాశ పడొద్దని కార్యకర్తలను ఓదార్చారు. పోరాటాల నుంచి వచ్చిన పార్టీ.. పోరాటాలు మాకు కొత్తమే కాదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన…. ప్రజలు గొంతుకై మాట్లాడతామని చెప్పారు.
అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటువేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారని కేటీఆర్ చెప్పారు. పవర్ పాలిటిక్స్ లో పరవ్ పోవడం సహజయన్నారు. ప్రజలు మనకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిద్దాం… తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ప్రజలు అంత తేలిగ్గా వదులుకోరని కేటీఆర్ చెప్పారు. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని మాట ఇచ్చా.. ఆ మాట నిలబెట్టుకున్నా.. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారని కేటీఆర్ తెలిపారు.