బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్ట్. నెల రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ బెయిల్ వ్యవహారం నేడు కొలిక్కి వచ్చింది. కవితకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీం కోర్ట్ మంజూరు చేసింది. దాదాపు 165 రోజుల నుంచి కవిత జైల్లోనే ఉన్నారు. బెయిల్ తీర్పు సందర్భంగా కవితకు విధించిన షరతులను సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి చదివి వినిపించారు. ఆమె జైలు నుంచి విడుదల అయ్యే సమయంలో పాస్పోర్ట్ ను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందని, అనుమతి లేకుండా దేశం దాటి వెళ్ళవద్దు అని కోర్ట్ ఆదేశించింది.
అలాగే ఒక్కో కేసుకు 10 లక్షలు పూచికత్తుని సమర్పించాలని కోర్ట్ పేర్కొంది. మూడు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ఆమెకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇక ఆమెకు బెయిల్ తెచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం చేయని ప్రయత్నాలు లేవు. ఎట్టకేలకు నేడు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావించి బీఆర్ఎస్ నేతలు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు బెయిల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఢిల్లీలోనే ఉన్నారు.
ఇక ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటిఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి సుప్రీం కోర్ట్ వెలుపల ఎదురు చూసారు. ధర్మాసనం తీర్పు పత్రాలను జైలు అధికారులకు చూపించి కవితను బయటకు తీసుకురానున్నారు. ఆమెకు బెయిల్ రావడంతో త్వరగా ట్రయల్ కోర్టుకు, అటు నుంచి తిహార్ జైలుకు పయనం అయ్యారు కేటిఆర్. సుప్రీంకోర్టు నుంచి బయటకు వస్తున్న కేటిఆర్ ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. కాని అక్కడ ఆయన ఏం మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. త్వరగా బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేయడం కోసం పరుగులు తీసారు.
భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కోర్ట్ పరిసరాల్లో ఏర్పడటంతో అక్కడి నుంచి బయట పడేందుకు పక్కనే వున్న ఆటో ఎక్కిన కేటీఆర్… అదే ఆటోలో జైలుకు వెళ్తున్నారు. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నేతలు కూడా పరుగులు తీసారు. సాయంత్రం 5 గంటల లోపు కవిత విడుదల కానున్నారు.