KTR Vs REVANTH REDDY: అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్.. విరుచుకుపడ్డ సీఎం

కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా విలువ ఉంటుంది. 51 శాతానికి 100 శాతం విలువ ఉంటుంది. 51 శాతం ఉన్న వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49 శాతం ఉన్న వాళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటారు.

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 02:05 PM IST

KTR Vs REVANTH REDDY: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పిస్తే.. అంతే ఘాటుగా బదులిచ్చారు సీఎం రేవంత్. దీంతో సభలో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. “గత 9 ఏళ్ల పాలన గుర్తుచేస్తున్న వారికి అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యంలో జరిగిన అరాచకాలను కూడా గుర్తు చేసుకోవాలి. ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ కేసీఆర్‌ పేరుపై మట్టి పూసినట్టుగా చరిత్రను చెరిపేయలేం. తెలంగాణకు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు కేసీఆర్‌.

BRS : బీఆర్ఎస్ కు వలసల భయం ! కాంగ్రెస్ వైపు సెకండరీ కేడర్ చూపు

తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచిన కొడుకు కేసీఆర్‌. గవర్నర్ చెప్పినట్టు మార్పు మొదలైంది.. నిర్బందం పోయిందన్నారు. వారు అన్నట్టుగానే 2014 జూన్ రెండు నాడే నిర్బంధం పోయింది. శ్రీ శ్రీ చెప్పినట్టు బానిసకొక బానిస అన్నట్టు తెలంగాణను పీడించిన వాళ్లు పోయినా వారిని తలుచుకునే వాళ్లు మాత్రం ఇక్కడే ఉన్నారు. మేం 39 మంది, వాళ్లు 65 మంది ఉన్నారని మిడిసి పడుతున్నారు. ఇది మంచిది కాదు. వాళ్లకు, మాకు మధ్య తేడా 1.85 ఓటు శాతం మాత్రమే. దీనికే మిడిసిపాటు తగదు” అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌పై విమర్శలు చేశారు. “కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా విలువ ఉంటుంది. 51 శాతానికి 100 శాతం విలువ ఉంటుంది. 51 శాతం ఉన్న వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49 శాతం ఉన్న వాళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటారు.

ప్రభుత్వం చేసే నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు చేపడతారు. అవసరమైతే అమరణ దీక్షలు చేస్తారు. ఆ స్పిరిట్‌ తీసుకోకుండా వాళ్లు 65 మంది ఉన్నారు.. మేము 39 మంది ఉన్నాం.. మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు పట్టి కొట్లాడతామంటే ఇక్కడ కుదరదు. ఇలాంటి భాష వాళ్ల గౌరవానికి, సభను నడిపించడానికి బాగోదు” అని రేవంత్ అన్నారు. అయితే, సీఎం తనను ఎన్నారై అనడాన్ని కేటీఆర్ ఖండించారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లుగా కాంగ్రెస్ఖలోని సీనియర్ నేతలు కష్టపడితే రేవంత్ రెడ్డే ఆ పుట్టలోకి చేరారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.