ఏపీలో వైసీపీ (YCP) అధికారంలో ఉన్న సమయంలో లక్ష్మీ పార్వతి (Lakshmi Parvati) ఓ వెలుగు వెలిగారు. ప్రభుత్వం నుంచి టీడీపీ (TDP) కి ఏ కౌంటర్ ఇవ్వాలన్నా అందరికంటే ముందే ఆమే కెమెరా ముందుకు వచ్చేది. వాయిస్ పెంచకుండా కూల్‌గా మాట్లాడుతూనే టీడీపీని ఓ ఆట ఆడుకునేంది. వైసీపీకి ఆమె అందించిన సేవలకు గానూ జగన్ ఆమెకు ఓ పదవి బహుమతిగా ఇచ్చారు. జగన్ సర్కార్ (Jagan Sarkar) లో ఆమె తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
అలాగే ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) ఆమెకు ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను కట్టబెట్టింది. రాష్ట్రంలో అధికార మార్పిడి తరువాత వైఎస్ జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిన కార్యక్రమం మొదలయ్యింది. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్శిటీ.. లక్ష్మీపార్వతి విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఆమెకు కేటాయించిన ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరించుకున్నట్టు పేర్కొంది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కిశోర్ బాబు (Kishore Babu) గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకూ లక్ష్మీపార్వతికి యూనివర్శిటీ నుండి వేతనం చెల్లించలేదని ఆయన తెలియజేశారు.
గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్శిటీ పరిశోధకులకు గైడెన్స్ అందించే బాధ్యత ఇచ్చారు. అయితే తాజాగా ఈ విధుల నుండి కూడా ఆమెను తప్పించినట్లు తెలిపారు. ఆమె దగ్గర మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్‌ను.. తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆదేశించామని యూనివర్శిటీ రిజిస్ట్రార్ కిశోర్ బాబు చెప్పారు. జగన్ ఎంతో అభిమానంతో ఇప్పించిన ఈ గౌరవం.. టీడీపీ అలా అదికారంలోకి రాగానే ఇలా ఊడిపోయింది.