ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండానే చాలా దేశాలను ఎంతోమంది కీలక నేతలు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. 70 ఏళ్లు దాటినా .. వారికి ఏజ్ లిమిట్ గురించి గుర్తు చేసే సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. వారు యువకుల కంటే బెటర్ గా పాలన అందిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏజ్ 80 ఏళ్లు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏజ్ 70 ఏళ్లు.. కామెరూన్ దేశ అధ్యక్షుడు పాల్ బీయా ఏజ్ 90 ఏళ్లు.. భారత ప్రధాని నరేంద్రమోడీ ఏజ్ 73 ఏళ్లు!! ఈనేపథ్యంలో ఓల్డేజ్ లీడర్లు దేశాలను ఎలా పాలిస్తున్నారు ? వారి దార్శనికత ఎలా ఉంది ? వారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఉద్యోగాలకు అలా.. రాజకీయాలకు ఇలా..
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి 80 ఏళ్ల జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి 77 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్‌లు తలపడే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా అమెరికా పౌరుల ఉద్యోగ విరమణ వయసు 67 ఏళ్లు. ఆ దేశ రాజకీయాల్లో మాత్రం రిటైర్మెంట్ వయసంటూ ఏమీ లేదు. రిటైర్మెంట్ ఏజ్ దాటిన లీడర్లు అమెరికా రాజకీయాలను శాసిస్తున్నారు. ఇక ఇండియాలో ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లు. దాని కంటే దాదాపు 13 ఏళ్లు ఎక్కువ ఏజ్ లో ఉన్న నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా సేవలు అందిస్తున్నారు. ఇక ఈ పదవుల అంశాన్ని పక్కన పెడితే.. సాధారణంగా మనుషుల్లో ఏజ్ పెరిగే కొద్దీ మెదడులో తెలివితేటలకు సంబంధించిన భాగం పనితీరు మారిపోతుందని అంటారు. ‘సూపర్ ఏజెర్స్’గా పిలుచుకునే కొంతమందిలో 80 ఏళ్లు వచ్చినప్పటికీ మెదడు సంబంధిత కాగ్నిటివ్ పనితీరు యువకుల కన్నా బెటర్ గా ఉంటుంది. ఈవిధంగా వయసు మీద పడినా యువకుల్లా పనిచేసే డైనమిక్ వరల్డ్ లీడర్స్, ‘సూపర్ ఏజర్స్’ లిస్టులో .. మోడీ, బైడెన్, పుతిన్ వంటి వారు ఉంటారు. ఇంతవరకు ఓకే.. కానీ ఉద్యోగాలలాగే రాజకీయాలకు కూడా ఏజ్ లిమిట్ ఉండాలనే వాదన బలంగా వినిపిస్తోంది. దానివల్ల ఈతరం అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కలిగిన యువనేతలకు ఛాన్స్ దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏజ్ పెరుగుతుంటే మెదడు సైజు తగ్గిపోయి.. 70 ఏళ్ల దాటాక..
వయసు పైబడే కొద్దీ మనిషి మెదడు సైజు తగ్గుతుంది. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగంపైనే ఈ ప్రభావం పడుతుంది. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత.. ప్రతి పదేళ్లకు ఈ భాగం 5 శాతం మేర సైజు తగ్గుతుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం మెదడులోని ఇతర భాగాలతో అనుసంధానమై, కార్యనిర్వాహక పనితీరును నిర్వర్తించడంలో హెల్ప్ చేస్తుంది. లీడర్ షిప్ కెపాసిటీకి ఎంతో అవసరమైన విషయ విశ్లేషణ, సమస్య పరిష్కరించే పరిణితి, లక్ష్య నిర్దేశం వంటి స్కిల్స్ కు ఈ భాగమే నెలవు. 70 ఏళ్ల ఏజ్ కు చేరగానే.. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం సైజులో మార్పులు జరుగుతాయి. 65 ఏళ్ల కంటే తక్కువ ఏజ్ ఉన్న వారిలో ‘వైట్ మ్యాటర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల మెదడులో చురుకుదనం తగ్గి, చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు.వయసు పెరిగే సమయంలో తలెత్తే హైపర్ టెన్షన్ సమస్య మెదడు పనితీరుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.