AP BJP: ఏపీ బీజేపీకి త్వరలో మరో షాక్?

అస్తశస్త్రాలు కూడగట్టుకుని రణరంగంలోకి దిగాల్సిన సమయంలో బీజేపీ... ఉన్న కొద్దిపాటి నేతలను కూడా పొగొట్టుకుంటోంది. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్న ఆవేదన.... ఎమ్మెల్యేగా పనిచేసిన నేత నోటి నుంచే బయటకొచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది మనకు అర్థమవుతోంది.

  • Written By:
  • Publish Date - February 21, 2023 / 03:55 PM IST

ఏపీలో కమలం కకావికలం అయ్యేలా ఉంది. వరుసగా వికెట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోతే పోనీ కన్నా ఒక్కడే కదా అనుకున్న బీజేపీ నేతలకు త్వరలో మరో షాకుల మీద షాకులు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ముఖ్యనేతలుగా ఉన్న ఇద్దరు ముగ్గురు కమలానికి బై బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి… ఇంతకీ ఎవరా నేతలు…? అదే జరిగితే ఆ దెబ్బ నుంచి బీజేపీ తేరుకుంటుందా…? అసలే అంతంతమాత్రంగా ఉన్న బీజేపీ నావ ఏ దరికి చేరుతుంది…?

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పారు. వెళుతూ వెళుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నాలుగు పంచులు వేసి మరీ వెళ్లారు. కన్నా సైకిల్ సవారీ ఖాయమైపోయింది. రాయపాటి సాంబశివరావు లాంటి సీనియర్ నేతలు నో నో అంటున్నా బాబు మాత్రం రారా అంటున్నట్లు చెబుతున్నారు.

కన్నా బాటలోనే మరికొందరు నేతలు బీజేపీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు దీన్ని సమర్ధిస్తున్నాయి. గుంటూరులో కన్నా ఇంటికి వచ్చిన ఆయన కాసేపు మంతనాలు జరిపారు. ఇది రొటీన్ మీటింగ్ అంటూ రొటీన్ డైలాగ్ చెబుతూనే పార్టీపై సెటైర్లు వేశారు. కార్యకర్తల మాటలు హైకమాండ్ వినే పరిస్థితి లేదన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తమకు అర్థం కావడం లేదన్నారు. తాను ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు విష్ణుకుమార్ రాజు… ఆయన మాటలు వింటుంటే త్వరలోనే ఆయన వికెట్ కూడా పడుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మా పార్టీ పరిస్థితి అయిపోయిందోచ్ అని ఆ సీనియర్ నేత చెప్పకనే చెప్పినట్లైంది.

విష్ణుకుమార్ రాజు బహిరంగంగా బయటపడితే మరికొందరు మాత్రం లోలోపలే రగిలిపోతున్నట్లు సమాచారం. త్వరలో మరో ముఖ్యనేత కూడా పార్టీని వీడతారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కూడా బీజేపీకి రాం రాం చెప్పబోతున్నట్లుగా బలంగా ప్రచారం సాగుతోంది. తారకరత్న మరణం వల్ల బ్రేక్ వచ్చింది కానీ లేకపోతే ఈ పాటికి పురంధేశ్వరి కూడా కమలంతో తన ప్రయాణం ముగిసినట్లు ప్రకటించేవారని చెబుతున్నారు. ఆమె కుటుంబం కూడా టీడీపీవైపే చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు గతంలోనే షికార్లు చేసినా ఈసారి మాత్రం కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ ప్రచారం నిజమై పురంధేశ్వరి కనుక పార్టీని వీడితే అది బీజేపీకి గట్టి దెబ్బే…

పురంధేశ్వరి మాత్రమే కాదు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా పార్టీని వీడాలన్న ఆలోచనలో ఉన్నట్లు బీజేపీ నేతలే చెబుతున్నారు. ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కామినేని ఎప్పుడు పార్టీని వీడతారన్నదే సస్పెన్స్. అసలే ఏపీలో కమలం గ్రాఫ్ అట్టడుగున ఉంది. ఇప్పుడు నేతలంతా వదిలేస్తే అది పాతాళానికే…

ఓవైపు రాష్ట్రంలో పార్టీని సమర్ధంగా కనిపించే నాయకుడు కనిపించడం లేదు. అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజును మార్చి మరొకరికి పగ్గాలు అప్పగించినా పార్టీలో వర్గాలు వారిని పనిచేయనిస్తాయా అంటే అనుమానమే… ఉన్నదే కొందరు నేతలు.. వారిలోనూ మళ్లీ ముఠాలు…ఎవరి అజెండా వారిదే… ఎన్నికలకు గట్టిగా ఏడాది కూడా లేదు… అన్ని అస్తశస్త్రాలు కూడగట్టుకుని రణరంగంలోకి దిగాల్సిన సమయంలో ఇప్పుడు బీజేపీ… ఉన్న కొద్దిపాటి నేతలను కూడా పొగొట్టుకుంటోంది. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్న ఆవేదన…. ఎమ్మెల్యేగా పనిచేసిన నేత నోటి నుంచే బయటకొచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది మనకు అర్థమవుతోంది. మరి నేతలు షిఫ్టై పోతున్నట్లు కార్యకర్తలు కూడా షిఫ్ట్ అయిపోతే ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి..? అసలు ఇంత అధ్వాన్నంగా ఆ పార్టీ పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా…?