e-Commerce Business:10 వసంతాలు పూర్తి చేసుకున్న ఇ-కామర్స్ సంస్థలు.. ఈ ఏడాది 90వేల కోట్ల బిజినెస్ మార్క్ ను తాకనున్నట్లు అంచనా..

నేటి యుగంలో వంట సామాన్ల మొదలు ఒంటికి పై వేసుకునే.. పూసుకునే వస్తువుల వరకూ అన్నీ ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. రానున్న పండుగ రోజుల్లో ఈ- కామర్స్ వేదికల ద్వారా దాదాపు రూ. 90 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగవచ్చని ఒక సంస్థ అంచనా వేసింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 09:30 AM IST

2023 లో ఆన్లైన్ వస్తుసేవల వినియోగం పెరిగిపోయింది. వాటి ద్వారా ఈ కామర్స్ సంస్థలకు పెద్ద  ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనా వేసింది. దీనికి కారణం గత రెండు మూడేళ్ళ కోవిడ్ పరిస్థితులను దాటుకొని ఈ ఏడాదిలో ప్రతి ఒక్కరి ఆర్ధిక స్థితి గతులు భారీగా పుంజుకున్నాయి. పైగా వినియోగదారులకు బయట వెళ్లి షాపింగ్ చేసేంత సమయం దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్ కే మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఈ కామర్స్ సంస్థలకు డిమాండ్ భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్ లో గ్రాస్ మర్చెండైజ్ విలువ 18-29 శాతం వృద్ది సాధించవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.

ఫెస్టివల్ సేల్స్ ప్రారంభమైతే..

అమెజాన్, ప్లిప్ కార్ట్, అజియో, మీషో వంటి దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక ఆఫర్స్ తేదీలను ఇప్పటి వరకూ అయితే ప్రకటించలేదు. విశ్లేషకులు అంచనా ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరోనా తరువాత ప్రతి ఒక్కరూ ఆన్లైన్ కొనుగోలుకే మద్దతు చూపినప్పటికీ అనుకున్నంత మేర వృద్ది సాధించలేదు. అయితే ఈ సంవత్సరం గతానికి భిన్నంగా పరిస్థితులు ఉంటాయని రెడ్ సీర్ అంచనా వేసింది.

ఎలా అంచనా వేశారు..

ఆన్లైన్ షాపింగ్ ద్వారా జరిగిన లావాదేవీలను పరిగణలోకి తీసుకొని నివేదికను వెల్లడించారు. 2023 జనవరి-జూలై ఆర్థవార్షికానికి జీఎంవీ శాతం గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే దాదాపు 10 శాతం వృద్ది సాధించినట్లు రీసర్చ్ లో వెల్లడైంది. దీంతో రానున్న పండుగ రోజుల్లో మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు అందించడంతో దీని వృద్ది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా పండుగ రోజుల్లో ఈ-కామర్స్ సైట్లపై దాదాపు 14 కోట్ల మంది తమకు కావల్సిన వస్తువులను అన్వేషిస్తున్నట్లు సర్వేలో తేలింది. వీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కామర్స్ గ్రాస్ మర్చండైజ్ వాల్యూ 20 రెట్లు పెరిగింది. ఒక ఏడాదిలో ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గతం కంటే 15 రెట్లు పెరిగింది.

పదేళ్ల సంబరాలు..

ఈ ఆన్లైన్ షాపింగ్ 2013లో ప్రారంభమైనట్లు నివేదికలో తెలిపింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి పదేళ్లు పూర్తి చేసుకోనుంది. 2014లో అన్ని ఇ-కామర్స్ సంస్థల పూర్తి ఆదాయం రూ. 27 వేల కోట్లు. అదే 2023 వచ్చే సరికి రూ. 5.25 లక్షల కోట్లకు చేరింది.  లెక్కన ఈ పండుగ సీజన్ కి మరింత పెద్ద ఎత్తున ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా గనుక జరిగితే గతంలో కొనుగోలు చేసిన వారికంటే ఎక్కువగా వినియోగదారులు ఈ సైట్లపై పడే ప్రభావం ఉంది. అలాగే సైట్లలో వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా మంచి ఆదాయం వచ్చి చేరే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పైగా ఇప్పుడు బ్యూటీ, ఫ్యాషన్, గృహాలంకరణ, పర్సనల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఇలా రకరకాలుగా అందుబాటులోకి వచ్చిన కారణంగా అమ్మకాలు పెరగవచ్చని రెడ్ సీర్ సంస్థ అంచాన వేసింది.

T.V.SRIKAR