Mumbai IIT: కులం నుంచి ఆహారం వరకు అంతా వివక్షే.. ఐఐటీ బొంబాయిలో ఏం జరుగుతోంది..!

ఉన్నత విద్యాలయాల్లో వివక్ష.. వేధింపులు.. ఆత్మహత్యలు కొత్తకావు. సమాజానికి దారి చూపించాల్సిన అత్యుత్తమ విద్యా సంస్థలు ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 10:32 AM IST

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా సంస్థగా ఉన్న ఐఐటీ బొంబాయిలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు విద్యార్థులు, తల్లిదండ్రులను, విద్యావేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐఐటీ బొంబాయిలో అడుగడుగునా కుల, మత, సాంఘిక వివక్ష ఏ స్థాయిలో ఉందో రెండు ఘటనలను చూస్తే అర్థమవుతుంది.

ర్యాంక్‌లు అడగొద్దంటూ మార్గదర్శకాలు

ఐఐటీ బొంబాయిలో చదువుతున్న వాళ్లెవరూ తోటి విద్యార్థుల జేఈఈ , గేట్ స్కోర్లు తెలుసుకునే ప్రయత్నం చేయవద్దని యాజమాన్యం కొన్ని రోజుల క్రితం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలాంటి వివరాలు తెలుసుకోవడం ద్వారా చివరకు విద్యార్థుల కులాల నుంచి చర్చించుకుంటున్నారని.. అది కులవివక్షకు దారి తీస్తోందని ఐఐటీ బొంబాయ్ చెబుతుంది. ఇలాంటి గైడ్ లైన్స్ జారీ చేయడం వెనుక ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్శన్ సొలంకి అనే బీటెక్ మొదటి సంవత్సరం స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. క్యాంపస్ లో తాను కుల వివక్ష ఎదుర్కొన్నానని కులం తెలియగానే.. ఇతర విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని తన తల్లితో ఫోన్ లో ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని రోజులకే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఐఐటీ బొంబాయి… కులవివక్ష ప్రదర్శించేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందులో భాగంగానే గైడ్ లైన్స్ జారీ చేసింది.

ఇక్కడ శాఖాహారులు మాత్రమే కూర్చోవాలి

ఓవైపు క్యాంపస్‌లో కులవివక్ష విద్యార్థుల ప్రాణాలు తీస్తుంటే.. క్యాంటీన్‌లో వెలిసిన శాఖాహారులకు మాత్రమే పోస్టర్లు సరికొత్త వివాదాన్ని రాజేశాయి. హాస్టల్ 12లో vegetarians only are allowed to sit here అంటూ కొంతమంది పోస్టర్లు అంటించారు. దీనిపై నాన్ వెజిటేరియన్ స్టూడెంట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలానా భోజనాన్ని పలానా ప్రాంతంలోనే కూర్చొని తినాలని… ఐఐటీ బొంబాయిలో అధికారికంగా ఎలాంటి నిబంధనలు లేవు. క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులందరూ క్యాంటీన్‌లో తమకు నచ్చిన ప్రాంతంలో కూర్చొని ఆహారం తీసుకోవచ్చు. అయితే జైన్ విద్యార్థులకు మాత్రం ప్రత్యేకమైన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ ఉన్నా..వాళ్లకు కూడా ప్రత్యేకమైన సిట్టింగ్ ఏరియా అంటూ లేదు.. క్యాంటీన్‌లో ఎక్కడైనా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయవచ్చు. శాఖాహారం పోస్టర్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు అంటించారు అన్న వాటిపై ఐఐటీ బొంబాయి విచారణ జరుపుతోంది.

విద్యార్థులు, అధ్యాపకుల్లో వివక్ష ఉందా?

మనదేశంలో కులగజ్జి నరనరాల్లోనూ జీర్ణించుకుపోయి ఉంటుంది. పేదరికం వెంటాడినా.. రేయింబవళ్లు కష్టపడి ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు సంపాదించినా… కులం పేరుతో దూషణలు ఎదుర్కొవడం, కులాన్ని సాకుగా చూపి కొంతమందికి దూరంగా ఉండటం.. కులం పేరుతో అవమానించడం జరుగుతూ ఉంటాయి. ఏ కులం వాళ్లు ఏ కులం వాళ్లను వేధిస్తున్నారు అన్న దాని కంటే.. పెద్ద కులం చిన్న కులం అన్న తేడా చాలా మందిలో కనిపిస్తుంది. విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొన్ని కులాలకు చెందిన విద్యార్థులను ప్రొఫెసర్లు ప్రోత్సహించి..బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని వేధించిన ఘటనలు లేకపోలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేములు ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరకు తనువు చాలించాడు. ఐఐటీ బొంబాయిలో కూడా కుల వివక్ష ఉందని చెప్పడానికి దర్శన్ సొలంకి ఆత్మహత్యే నిదర్శనం.

అత్యుత్తమ ప్రమాణాలు అంటే ఇవేనా ?

సాటి మనిషిని సమానంగా చూసే సమానత్వపు విలువలు కనుమరుగవుతున్న కాలంలో మనం బతుకుతున్నాం. చదువు విజ్ఞానాన్ని అందించి.. అనాగరిక భావజాలాన్ని దూరం చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక కాలంలో బతుకుతూ కూడా ఇంకా కులం, మతం, వెజ్ నాన్ అంటూ మనుషులను దూరంగా పెడుతున్నామంటే.. సామాజికంగా, సాంఘికంగా మనిషి వెనకడుగు వేస్తున్నట్టే. ఐఐటీ బొంబాయిలో వెలుగులోకి వచ్చిన ఘటనలు.. పైకి చిన్నవిగానే కనిపించినా.. వ్యవస్థలో కూరుకుపోయిన వివక్షకు అద్దం పడుతున్నాయి.