Private Jet: లక్కీ ఛాన్స్.. భారీ విమానంలో ఒకే ఒక్కడు.. ప్రైవేటు జెట్‌లా మారిన ప్యాసింజర్ ఫ్లైట్!

ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించాలంటే లక్షలకు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఒక వ్యక్తి మాత్రం కేవలం రూ.13 వేలు మాత్రమే చెల్లించి విమానంలో ఒంటరిగా ప్రయాణించాడు. ప్రైవేట్ జెట్ అనుభూతిని పొందాడు. అలాగని అదేమీ ప్రైవేట్ జెట్ కాదు. ప్యాసింజర్ ఫ్లైట్.

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 05:12 PM IST

Private Jet: ఒకరిద్దరు లేదా తక్కువ మంది కుటుంబ సభ్యులు మాత్రమే ప్రయాణించేందుకు వీలుగా ఉండేవి ప్రైవేట్ జెట్స్. అయితే, వీటిల్లో ప్రయాణించడం చాలా కష్టమైన వ్యవహారం. సాధారణ విమానాల్లో ప్రయాణించడం సులభమే. కానీ, ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించాలంటే లక్షలకు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఒక వ్యక్తి మాత్రం కేవలం రూ.13 వేలు మాత్రమే చెల్లించి విమానంలో ఒంటరిగా ప్రయాణించాడు. ప్రైవేట్ జెట్ అనుభూతిని పొందాడు. అలాగని అదేమీ ప్రైవేట్ జెట్ కాదు. ప్యాసింజర్ ఫ్లైట్. పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉండాల్సిన విమానంలో అతనొక్కడే ప్రయాణించాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది?

ఈ అరుదైన ఘటన బ్రిటన్‌లో జరిగింది. బ్రిటన్‌కు చెందిన పాల్ విల్కిన్సన్ అనే 64 ఏళ్ల వృద్ధుడు నార్తర్న్ ఐర్లాండ్ నుంచి పోర్చుగల్ వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం అతడు జెట్2ఫ్లైట్ విమానంలో టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. నిర్ణీత సమయానికి అతడు బెల్ఫాస్ట్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాడు. అక్కడికి చేరాక పెద్ద క్యూ ఉంటుందేమో.. అంతసేపు ఎలా నిలబడాలో అంటూ కంగారుపడ్డాడు. కానీ, విమానాశ్రయంలోకి ఎంట్రీ అయ్యేందుకు ఎలాంటి క్యూ లేదు. ఒక్కడే బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడే అతడికి ఏదో అనుమానం వచ్చింది. అక్కడ్నుంచి విమానం దగ్గరకు చేరుకున్నాడు. తనతోపాటు ప్రయాణికులు ఎవరూ లేరు. దీంతో కంగారుపడ్డాడు. ఒకవేళ తానేమైనా ముందుగా వచ్చాడా.. లేక ఆలస్యంగానా అని అనుమానపడ్డాడు. ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందేమో అనుకున్నాడు. కానీ, అదేమీ లేకుండా విమానం దగ్గరికి చేరుకున్నాడు.
ఒక్కడే ఎంట్రీ
విమానం దగ్గరికి చేరుకున్నాక లోపలికి వెళ్లబోయాడు. విమానం డోర్ దగ్గర ఉన్న సిబ్బంది ‘పాల్ గారూ.. మీరు ఇవ్వాళ మా వీఐపీ గెస్ట్. ఈ రోజు మీరొక్కరే ప్రయాణించబోతున్నారు’ అన్నారు. లోపలికి వెళ్లి చూసేసరికి ఎవ్వరూ లేరు. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ‘ప్రైవేట్ జెట్‌లోలాగా మీరొక్కరే ప్రయాణించవచ్చు’ అని విమానం సిబ్బంది చెప్పారు. దీంతో అనుమానం వచ్చి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. ఆ విమానంలో తానొక్కడే ప్రయాణికుడు అని. ఆ రోజు ఇంకెవరూ టిక్కెట్లు బుక్ చేసుకోలేదని, దీంతో తను మాత్రమే విమానంలో ప్రయాణించబోతున్నానని అతడికి తెలిసింది.

ఈ విషయం తెలిసి పాల్ విల్కిన్సన్ ఎంతో సంతోషానికి లోనయ్యాడు. ఒక్కడే ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయానని, అది నిజమా.. కాదా అని నమ్మలేకపోయానని పాల్ అన్నాడు. ఒక్కడే విమానం అంతా తిరిగినట్లు, నచ్చిన సీట్లో కూర్చున్నట్లు చెప్పాడు. సాధారణంగా ఇలా ఒక్కరే ప్రయాణికుడు ఉన్నప్పుడు విమానయాన సంస్థలు విమానాల్ని రద్దు చేస్తుంటాయి. కానీ, ఈ సంస్థ మాత్రం విమానాన్ని రద్దు చేయకుండా ప్రయాణించడం విశేషం. ఒక్కడికి అయిన టిక్కెట్ ఖర్చు మన కరెన్సీలో రూ.13,000 మాత్రమే. కానీ, ఈ రూట్లో ఒక ప్రైవేటు ఫ్లైట్ అద్దెకు తీసుకుని ప్రయాణించాలంటే రూ.25 లక్షలు ఖర్చవుతుందట. అంటే పాల్ మాత్రం రూ.13 వేలే చెల్లించి.. రూ.25 లక్షల అనుభూతిని పొందాడు.