Lucknow and Lakshmana Link: లక్నోకు లక్ష్మణుడికి లింకేంటి..? ఆ నగరం పేరు మార్చాల్సిందేనా..?

  • Written By:
  • Publish Date - February 10, 2023 / 01:18 PM IST

దేశంలో పేర్ల పంచాయితీ కొత్తేం కాదు… ఎప్పుడూ ఎక్కడో చోట ఏదో ఓ ఊరు పేరు మీద రగడ జరగాల్సిందే…. లేకపోతే మన నేతలకు నిద్దరుండదు కదా…. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పేరుపై రాజకీయం మొదలైంది. దాన్ని లక్ష్మణ్ పూర్ అనో లకన్ పూర్ అనో అనాలన్నది లేటెస్ట్ డిమాండ్…. బీజేపీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా తాజాగా ఈ డిమాండ్్ ను తెరపైకి తెచ్చారు. లక్నో పేరును వెంటనే మార్చాలని ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. లక్నో నగరానికి రామాయణానికి లింకుదన్నది ఎంపీగారి వాదన… ఇంతకీ లక్నో పేరు మార్చాలా….? ఈ నవాబుల నగరం వెనకున్న కథేంటి….? బీజేపీ నేతల వాదనేంటి….?

 

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో తన సోదరుడు లక్ష్మణుడికి ఈ నగరాన్ని బహుమతిగా ఇచ్చాడని చెబుతారు. ఆయన పేరిట లక్ష్మణగుట్ట ఉండేదట. అప్పట్లో దీన్ని లక్షన్ పూర్ లేదా లక్ష్మణ్ పూర్ అని పిలిచేవారు. కొన్ని శతాబ్దాల వరకూ ఆ పేరు అలాగే ఉంది. అయితే కాలక్రమేణా అవద్ ప్రాంతం నవాబుల పాలనలోకి వచ్చింది. ఆ సమయంలోనే లఖన్ పూర్ కాస్తా లక్నోగా మారిందన్నది నమ్మకం. నవాబ్ అసఫ్ ఉద్దౌలా దీని పేరును లక్నో అని మార్చారట. కొన్ని శతాబ్దాలుగా ఇది లక్నోగానే చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ పేరు మార్చాలన్నది బీజేపీ నేతల వాదన..

 

ప్రజల సొమ్ముతో విలాసాలు వెలగబెట్టిన నవాబుల బానిస భావజాలన్ని ఈ అమృతకాలంలోనూ కొనసాగించాలా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ గారు ఇలా డిమాండ్ చేశారో లేదో అలా వెంటనే యూపీ ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని డిప్యుటీ సీఎం బ్రజేష్ పాతక్ ప్రకటించారు. లక్నో అంటే లక్ష్మణ్ పూర్ అని అందరికీ తెలుసన్న ఆయన మాటలను చూస్తే మాకు ఓకే అని చెప్పకనే చెప్పినట్లైంది. దీనిపై ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ ను బట్టి యోగీ ప్రభుత్వం స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

నిజానికి లక్నో పేరు మార్చాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు… చాలాకాలం నుంచే దీనిపై చర్చ జరుగుతోంది. అప్పుడెప్పుడో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నో పేరును లఖన్ పూర్ గా మార్చేస్తుందన్న ప్రచారం జరిగింది. గతంలో ఓసారి ప్రధాని నరేంద్రమోడీ లక్నో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. ప్రభు లక్ష్మణ్‌జీకి పవిత్రమైన నగరమైన లక్నోలోకి మీకు స్వాగతం’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా కూడా నిలిచింది. యోగీ సర్కార్ పేరు మార్చేయడం ఖాయమని అందరూ అంచనా వేశారు. అయితే కొన్ని అభ్యంతరాలతో అది ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా మరోసారి పాత డిమాండ్ తెరపైకి వచ్చింది.

 

గతంలో బీజేపీ సీనియర్ నేతలు కల్ రాజ్ మిశ్రా, లాల్డీ టాండన్ లు కూడా ఇదే తరహా డిమాండ్ విధించారు. టాండన్ తన పుస్తకంలో లక్నోను గతంలో లక్ష్మణ్‌పూర్, లక్ష్మణావతి అని పిలిచేవారని, ఆ తర్వాత లక్నోతి, లఖన్‌పూర్‌ అని పిలిచారని, ఆ తర్వాత లక్నోగా పిలుస్తున్నట్లు రాసుకొచ్చారు. ఈ చారిత్రక నగరంలో శ్రీరాముని ప్రియ సోదరుడు లక్ష్మణమూర్తికి సంబంధించిన ఆధారాలు ఉండొచ్చని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు.

 

లక్ష్మణుడు స్థాపించిన లక్ష్మణపురి కాలక్రమేణా ఆనవాళ్లు కోల్పోయిందన్నది వారి వాదన. లక్ష్మణుడు గుట్టను చేరుకునేందుకు గోమతీ నదిని దాటాడని రామాయణంలోని కిష్కింధకాండలో ఉందన్నది కొందరు చరిత్రకారుల వాదన. ఆ తర్వాత ముస్లిం పాలకుడు ఔరంగజేబు అక్కడే ఓ మసీదు నిర్మించాడంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని వలీ మసీదుగా పిలుస్తున్నారు. ఆ గుట్టను పూర్తిగా తవ్వితే లక్ష్మణుడికి నగరంతో ఉన్నఅనుబంధానికి సంబంధించిన ఆధారాలు దొరకొచ్చని చెబుతున్నారు. మరికొందరు చరిత్రకారులు అయితే అసలు ఆ నగరాన్ని స్థాపించింది అసద్ ఉద్దౌలా అనే చెబుతున్నారు. అయితే ఇవన్నీ వారి వాదనలు మాత్రమే… నమ్మకాలు మాత్రమే.. దేనికీ పూర్తి ఆధారాలు లేవు. రామాయణంలో ప్రస్తావించినట్లుగా చెబుతున్న లక్నోతి ఇదేనా కాదా అన్నది తెలియదు… అది తేలాలంటే దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించాలి. కానీ మసీదు ఉన్న ప్రాంతంలో తవ్వకాలు సాధ్యం కాదు. అదో తలనొప్పి…

 

శ్రీరామచంద్రుడు జన్మించినట్లు బలంగా నమ్మే అయోధ్యకు లక్నోకు మధ్య దూరం 135 కిలోమీటర్లు. ప్రస్తుతం అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సీతారామ విగ్రహాల తయారీకి నేపాల్ నుంచి కోట్ల సంవత్సరాల వయసున్న శిలలను కూడా తెప్పించారు. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అదే ఊపులో ఇప్పుడు లక్నో పేరును కూడా మార్చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరి యోగీ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

(KK)