వేలకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.. రోజులకు రోజులు నిరాహార దీక్షలు చేశారు. పోలీసుల మీద చేయి చేసుకున్నారు.. తన మీద చేయి చేసుకున్నారని వివాదాలు సృష్టించారు. ఇన్ని జరిగాక.. ఎవరైనా సరే రాజకీయాల్లో (Politics) హైలైట్ కావాలి. అదేంటో షర్మిల (Sharmila) పరిస్థితి మరి! పొలిటికల్ మైలేజ్ (Political mileage) రాకపోగా.. మీమర్లకు, ట్రోలర్లకు ఆయుధంగా మారిపోయారు. పార్టీని ఒంటరిగా నడిపించడం కష్టం అని కాంగ్రెస్‌తో కలుద్దాం.. కాంగ్రెస్ (Congress) లో కలిపేద్దాం అని ఫిక్స్ అయ్యారు. చివరికి అది కూడా సక్సెస్ కాలేదు. దీంతో కాంగ్రెస్‌తో కలవకపోవడం అదృష్టం అని.. ఒంటరిగా పోటీ చేద్దామని ప్రకటించారు. కట్ చేస్తే.. వారం రోజులు ఇలా గడిచాయో లేదో మరో ప్రెస్‌మీట్ పెట్టి.. పోటీ నుంచి తప్పుకుంటున్నాం.. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తాం అని చెప్పేశారు షర్మిల. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఎందుకు సవాళ్లు విసిరారు.. ఆ తర్వాత ఎందుకు కూల్ అయ్యారు.
పొంగులేటి (Ponguleti Srinivas Reddy) మీద ప్రతీకారం తీర్చుకుంటారు అనుకుంటే.. అదే పొంగులేటికి సపోర్ట్ చేస్తా అని ఎందుకు ప్రకటించారు. షర్మిల నిర్ణయం వెనక ఎవరున్నారు. ఎవరు వెనక ఉండి నడిపించారు. ఇలా చాలా చర్చ జరిగింది. నిజానికి ఎవరినీ సంప్రదించకుండా.. పార్టీలో చర్చించకుండా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు షర్మిల. ఐతే షర్మిల నిర్ణయం తీసుకోవడం వెనక ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం.. ఈ మధ్య తెలంగాణకు వచ్చారు. క్రిస్టియన్ మత పెద్దలతో సమావేశం నిర్వహించినట్లు టాక్. అక్కడే షర్మిల విషయం ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. షర్మిల బరిలో ఉంటే క్రిస్టియన్ల ఓట్లు కాంగ్రెస్‌కు పడవని చిదంబరం అంచనాకు వచ్చారు.
దీంతో బ్రదర్ అనిల్ కుమార్ (Brother Anil Kumar) తో మాట్లాడి బరి నుంచి తప్పుకోవాలని కోరినట్లు సమాచారం. భవిష్యత్‌లో పార్టీ పరంగా మంచి పదవి కూడా షర్మిలకు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఖమ్మం, పాలేరులో దాదాపు 10వేల వరకు క్రిస్టియన్ ఓటర్లు ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. దీంతో పాటు సికింద్రాబాద్‌లో కూడా ప్రభావం చూపగలిగే స్థాయిలో క్రిస్టియన్లు ఉన్నారు. షర్మిల పార్టీ బరిలో ఉంటే ఆ ఓట్లు చీలిపోతాయని.. దీంతో పోటీ నుంచి తప్పుకుని మద్దతు ఇవ్వాలని చిదంబరం కోరినట్లు తెలిసింది. దీంతో బ్రదర్ అనిల్ కుమారే స్వయంగా వైఎస్ షర్మిలను ఒప్పించినట్లు సమాచారం.