Parliament attack: పార్లమెంటులో బుధవారం జరిగిన దాడి ఘటన సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంటుపై దాడి జరిగింది. 2001 డిసెంబర్ 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లాకు. వీరిని అడ్డుకునే క్రమంలో భద్రతా దళాలు, ఇతర సిబ్బందిసహా మొత్తం 9 మంది అమరులయ్యారు. అనంతర భద్రతా దళాల తీవ్రవాదుల్ని కాల్చి చంపారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నూతన పార్లమెంట్ భవనంలో దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు సభలో అలజడి సృష్టించారు.
New Parliament : కొత్త పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన అగంతకులు
ఒక వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోపలికి దూకగా.. మరో వ్యక్తి అదే గ్యాలరీ నుంచి స్మోక్ బాంబు వదిలి సభ్యులను భయభ్రాంతులకు గురి చేశాడు. గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన వ్యక్తి, ఎంపీలు కూర్చునే టేబుళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎంపీలు ఇద్దరిలో ఒకరిని బంధించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో సభను స్పీకర్ వెంటనే వాయిదా వేశారు. ఇద్దరు పార్లమెంట్ లోపల అలజడి సృష్టిస్తుంటే.. బిల్డింగ్ బయట కూడా మరో ఇద్దరు ఆందోళనకు ప్రయత్నించారు. పసుపు, ఎరుపు రంగు స్మోక్ బాంబ్స్ వదిలారు. దీంతో లోపల ఇద్దరిని, బయట మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఒక మహిళ కూడా ఉంది. నిందితులను గురించి తెలుసుకుని, వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను నీలం, అమోల్ షిండే, సాగర్ శర్మ, మనోరంజన్ గా గుర్తించారు. నిందితులు తానాషాహీ బంద్ కరో.. భారత్ మాతాకీ జై.. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.
ఎలా వచ్చారు..?
మైసూర్ ఎంపీ పేరుతో పాసులు తీసుకొని ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోని విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారు. అయితే సభలోకి వచ్చేటప్పుడు.. కాలి బూట్లల్లో కలర్ గ్యాస్ షెల్స్ పెట్టుకొని వచ్చారు. గ్యాలరీలోకి వెళ్లిన తర్వాత షూస్ నుంచి ఆ షెల్ బయటకు తీసి.. దాని పిన్ తొలగించడంతో సభ మొత్తం పొగ అలుముకుంది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు సభలో జీరో అవర్ జరుగుతోంది. సభలో ఎంపీలు మాట్లాడుతుండగా.. సడన్ గా పొగ అలుముకోవడంతో ఏం జరుగుతుందో తెలియక కొందరు ఎంపీలు బయటకు పరుగులు తీశారు. మరికొందరు ఎంపీలు.. భద్రతా సిబ్బందితో కలసి.. ఆగంతకుడిని పట్టుకోడానికి ప్రయత్నించారు.
భద్రతా వైఫల్యమే కారణం
ఆగంతకులు పార్లమెంటులోకి చొరబడటానికి భద్రతా వైఫల్యమే కారణమని తెలుస్తోంది. పటిష్ట భద్రత ఉండే.. పార్లమెంట్‌లోకి స్మోక్‌బాంబ్ వంటి ప్రమాదకర రసాయనాలు తీసుకు రావడం అతి పెద్ద భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. ప్రేక్షకుల గ్యాలరీలోనికి రావడానికి కూడా ఐదంచెల సెక్యూరిటీ సిస్టమ్ దాటి రావాల్సి ఉంటుంది. అలాంటి, భద్రతా వ్యవస్థను దాటి నిందితులు సభలోకి ఎలా ప్రవేశించారు అనే సందేహాలు, ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఆ స్మోక్ బాంబ్స్ ప్రాణాంతకమైనవి అయ్యుంటే పరిస్థితి ఏంటా అని పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతున్నట్లు స్పీకర్ తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధికార సభ్యులు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఎంపీలు లోపలే ఉన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి. ఈ సంఘటన తర్వాత విజిటర్స్ పాసులను రద్దు చేశారు స్పీకర్. పార్లమెంట్ లో దాడిని కేంద్ర తీవ్రంగా పరిగణించింది. భద్రతా వైఫల్యంపై విచారణ జరిపేందుకు ఢిల్లీ సీపీ, హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా పార్లమెంట్ కు చేరుకున్నారు.