తన వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వివిధ వర్గాల ప్రజలను కలిసి, వారి సమస్యలు తెలుసుకొని భరోసా ఇవ్వడానికి వీలుగా లోకేశ్ దీనిని చేపట్టారు. ఇప్పటి వరకూ 32 బహిరంగ సభలు జరిగాయి. స్థానిక సామాజిక వర్గం, వృత్తి పనికి సంబంధించిన వర్గాల వారితో 87 సమావేశాలు, ‘‘హలో లోకేశ్’’ పేరుతో యువత, రైతులు, ముస్లిం మైనారిటీలతో నాలుగు ప్రత్యేక చర్చా గోష్టులు నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 45 రోజులు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 9 నియోజకవర్గాల పరిధిలో 23 రోజులు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకూ 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 32 రోజులు లోకేష్ పర్యటించారు. ఈ వంద రోజుల్లో లోకేశ్ మూడుసార్లు యాత్రకు విరామం ఇచ్చారు. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఉగాది సందర్భంగా మాత్రమే ఆయన యాత్రను ఆపారు.
లోకేశ్ పాదయాత్ర కోసం 13 కమిటీలను నియమించారు. ఎవరి పనులు వాళ్లకు అప్పగించి ఎక్కడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా యాత్ర కంటిన్యూ చేశారు లోకేష్. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై యాత్రలో లోకేశ్ హామీల వర్షం కురిపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ది పనులు చేపడుతుందో ప్రజలకు వివరించారు. యువగళంలో లోకేశ్ నడిచిన ప్రతీ వంద కిలో మీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించి ఒక హామీతో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేరుస్తామని ప్రకటిస్తున్నారు.
యాత్ర 1,000 కిలో మీటర్లకి చేరుకున్న సమయంలో ఆదోనిలోని సిరిగుప్ప క్రాస్ వద్ద 21వ వార్డును దత్తత తీసుకొని టీడీపీ అధికారంలోకి రాగానే ఆ వార్డులో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా ఇప్పటి వరకు 12 ప్రాంతాల్లో ఫలకాలు వేశారు. యువగళం యాత్రలో సెల్ఫీ చాలెంజ్ అనే కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు లోకేష్. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలు, చేసిన పనుల వద్ద సెల్ఫీలు దిగి అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. అనంతపురం జిల్లాలోని కియా కార్ల ఫ్యాక్టరీ వద్ద ఆయన మొదటి సెల్ఫీ చాలెంజ్ విసిరారు. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి, ఉద్యోగులతో కలిసి సెల్ఫీ దిగారు. వీరంతా తమ హయాంలో తెచ్చిన కంపెనీలో పనిచేస్తున్నారని.. వైసీపీ తెచ్చిన పరిశ్రమలు ఏవైనా ఉంటే ఆ పార్టీ నేతలు కూడా సెల్ఫీ దిగి చూపించాలని సవాల్ విసిరారు.
ఈ సవాళ్ళకు అధికార పార్టీ నేతలు ఎవరూ ప్రతిస్పందించలేదు. సెల్ఫీ విత్ లోకేష్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాదయాత్రలో ‘‘సెల్ఫీ విత్ లోకేశ్’’ పేరుతో తాను బస చేసిన ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు, సందర్శకులతో లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. దీనికోసం ఉదయం ఒక గంట సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ వంద రోజుల్లో ఆయనతో లక్షన్నర మంది సెల్ఫీలు దిగినట్లు టీడీపీ చెప్తోంది. దీనికి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ జోడించి ఎవరి ఫోన్‌కు వారి ఫొటోలు వెంటనే అందే ఏర్పాట్లు చేశారు. ఇక పాదయాత్రలో ప్రసంగాలు, పదునైన విమర్శలతో లోకేశ్ రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శల దాడి చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి ఆరోపణలను ఆధారాలతో సహా బయటపెడుతూ నేతల అవినీతిని ఎండగడుతున్నారు.