Chandra Babu: చంద్రబాబు ఒంటరిపోరుకే సిద్ధమయ్యారా.. పవన్‌తో తేలేది లేదని ఫిక్స్ అయ్యారా ?

ఏపీ రాజకీయాలు గజిబిజిగా మారిపోయాయ్. ఎవరు ఎవరితో కలుస్తారో.. ఎవరి కోసం ఎవరు రంగంలోకి దిగుతారో.. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంత ఈజీగా అర్థం కాని పరిస్థితి.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 03:01 PM IST

టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయ్ ఇదే ఫైనల్ అనుకుంటున్న సమయంలో.. వారాహి యాత్రలో పవన్ కామెంట్స్ కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. పార్టీ బలం పెరిగిందని.. పొత్తు కుదిరినా నెగ్గాల్సింది కూడా తన మాటే అని చంద్రబాబు, టీడీపీకి పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు పవన్. యువగళంతో కంపేర్ చేస్తే వారాహియాత్రకు సూపర్ రెస్పాన్స్ రావడం.. ఇదే కంటిన్యూ అయితే సీట్ల విషయంలో తేడా కొట్టే పరిస్థితి ఉండడంతో.. ఇప్పుడు పవన్‌తో పొత్తుల వ్యవహారంపై చంద్రబాబు ఆలోచనలో పడ్డారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.

జనసేన, బీజేపీని కలుపుకొని వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తుల అంశంపై అనేకసార్లు చర్చించింది. తనకు ముఖ్యమంత్రి అయ్యే ఆశలు లేవని అప్పట్లో చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. జనసేనను గెలిపించండి.. నేనే ముఖ్యమంత్రి అవుతానని వారాహి యాత్రలో పదేపదే చెప్తున్నారు. ఇది సైకిల్ పార్టీకి, టీడీపీ అధినేతకు కోపం తెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న దానిపై.. చంద్రబాబు కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

దీనికోసం ప్రత్యేకంగా అనేక సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నారట. టీడీపీ ఒంటరిగా వెళ్లినా గెలిచే అవకాశాలు ఉన్నాయని నివేదికలు అందాయట. దీంతో పొత్తుల చట్రంలో ఇరుక్కొని ఇబ్బందులు పడే కంటే.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తేనే మంచిదనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా.. ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసి టీడీపీ గెలవలేదు అనే విమర్శకు కూడా చెక్‌ పెట్టాలని చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది ప్రచారం మాత్రమే. పార్టీ ముఖ్యులు, నేతలతో చర్చించి.. అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయ్. ఐతే ఇదంతా ఉత్త ముచ్చటే అని.. పవన్ దాడికి దిగారని.. చంద్రబాబు ఇలాంటి గేమ్ ప్లాన్ సిద్ధం చేశారని మరికొందరి అభిప్రాయం.