KCR GRAND ENTRY : వస్తాడయ్యా స్వామి ! పుట్టిన్రోజుకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత కాలుజారి పడి.. తుంటె ఎముక విరగడం.. హాస్పిటల్ లో ఆపరేషన్.. నందినగర్ ఇంట్లో రెస్ట్.. ఇలా కేసీఆర్ ప్రయాణం నెలరోజులుకు పైగా గడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  (Telangana Elections) ఓటమి.. ఆ తర్వాత కాలుజారి పడి.. తుంటె ఎముక విరగడం.. హాస్పిటల్ లో ఆపరేషన్.. నందినగర్ ఇంట్లో రెస్ట్.. ఇలా కేసీఆర్ (KCR)  ప్రయాణం నెలరోజులుకు పైగా గడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లోనూ ఆ నైరాశ్యం కనిపిస్తోంది. మరో 3 నెలల్లో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections)  రాబోతున్నాయి. వాటికల్లా పుంజుకోడానికి కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు. రెండు నెలల విశ్రాంతి తరువాత.. జనంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా ఆయన పుట్టిన రోజు ఫిబ్రవరి 17 నాడు.. ఈ ఎంట్రీ మామూలుగా ఉండదని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు.

ఎర్రవల్లి ఫామ్ హౌస్ (Erravelli Farm) లో డిసెంబర్ 8నాడు కేసీఆర్ కాలు జారి పడటంతో.. తుంటె ఎముక విరిగింది. ఆపరేషన్ తర్వాత హైదరాబాద్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. మరో 3, 4 వారాల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని నేతలు చెబుతున్నారు. ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు. ఆరోజు గ్రాండ్ ఎంట్రీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. లీడర్లు, కార్యకర్తల్లో ఉత్సాహం, ఆత్మస్థయిర్యం నింపేందుకు కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. ఆయనకు భారీగా స్వాగత పలకాలని కేడర్ ఇప్పటికే నిర్ణయించింది. ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజు నాడు.. జంట నగరాల్లో భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. నందీనగర్ లో కేసీఆర్ ఇంటి నుంచి పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ వరకూ భారీ కాన్వాయ్ ఏర్పాటు చేస్తున్నారు.

గజ్వేల్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన కేసీఆర్.. అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఫిబ్రవరి 20 తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళతారు. ఈసారి గెలిస్తే గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు కేసీఆర్. అందుకే నెలలో కొన్ని రోజులు ఇకపై అక్కడికి వెళతారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటానికి.. ప్రతి రోజూ తెలంగాణ భవన్ కి రావాలని కేసీఆర్ నిర్ణయించారు. గతంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ప్రగతి భవన్ గేటు దాటి లోపలికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఆ అహంకారమే దెబ్బతీసిందని విమర్శలు రావడంతో.. ఇకపై అందర్నీ కలుసుకోడానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులను ఖరారు చేయడం, కేడర్ ను సమాయత్తం చేయడంపై కేసీఆర్ దృష్టిపెట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అందుకే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేలోపు.. వరంగల్ లో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. గ్రాండ్ ఎంట్రీ తర్వాత.. కాంగ్రెస్ హామీలు, ఇప్పటిదాకా అమలు జరుగుతున్న తీరుపై కేసీఆర్ విమర్శలు చేసే అవకాశముంది.