లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ న్యూయార్క్‌లోనే క్రికెట్ మ్యాచ్ లు

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడాసంబరం ఒలింపిక్స్ నిర్వహణ అంటే ఆషామాషీ కాదు. వచ్చే ఒలింపిక్స్ కు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఆతిథ్యమిస్తుండగా... కొన్ని క్రీడల నిర్వహణ వారికి సవాల్ గా మారింది. శతాబ్ధం తర్వాత ఒలింపిక్స్ లోకి రీఎంట్రీ ఇస్తున్న క్రికెట్ మ్యాచ్ ల విషయంలో నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు.

  • Written By:
  • Publish Date - October 23, 2024 / 01:48 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడాసంబరం ఒలింపిక్స్ నిర్వహణ అంటే ఆషామాషీ కాదు. వచ్చే ఒలింపిక్స్ కు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఆతిథ్యమిస్తుండగా… కొన్ని క్రీడల నిర్వహణ వారికి సవాల్ గా మారింది. శతాబ్ధం తర్వాత ఒలింపిక్స్ లోకి రీఎంట్రీ ఇస్తున్న క్రికెట్ మ్యాచ్ ల విషయంలో నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. ఏ మైదానంలో మ్యాచ్‌లు ఆడించాలనేది గంద‌ర‌గోళంగా మారింది. ప్ర‌ధాన వేదికగా ఉన్న క్వాలిఫోర్నియా ప‌శ్చిమ తీరంలో ఉండగా.. తూర్పు తీరంలో ఉన్న న్యూయార్క్‌లో క్రికెట్ మ్యాచ్‌ల‌కు ఆద‌ర‌ణ ఎక్కువగా ఉండడంతో అక్కడే నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే లాస్ ఏంజెల్స్‌కు, భార‌త కాల‌మానానికి దాదాపు 12 గంట‌ల 30 నిమిషాల తేడా ఉంటుంది. ఇక్క‌డ‌ రాత్రి 8 గంట‌ల‌కు క్రికెట్ మ్యాచ్‌లు ఆడిస్తే.. భార‌త్‌లోని అభిమానులు ఉద‌యం 8 గంట‌ల‌కు లైవ్ చూసే వీలుంది. అటు న్యూయార్క్‌ కూ, ఇండియాకు 9 గంట‌ల 30 నిమిషాలు తేడా ఉంటుంది.

ఇదిలా ఉంటే ఇటీవల న్యూయార్క్ టీ ట్వంటీ ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చింది. అక్కడి న‌స్సౌ క్రికెట్ స్టేడియంలో ఊహించ‌ని బౌన్స్‌తో బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడగా.. బౌల‌ర్లు చెలరేగిపోయారు. దీంతో అస‌లు టీ20 మ‌జానే లేకుండా స్వ‌ల్ప స్కోర్లు నమోదవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి పిచ్ లపై టీ ట్వంటీ మ్యాచ్ లు నిర్వహిస్తారా అంటూ అమెరికన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ లో మాత్రం స్పోర్టివ్ వికెట్ సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా బ్యాటర్లకు అనుకూలించే పిచ్ లు ఉంటే బెటర్ అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

మరోవైపు సుధీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో మళ్ళీ క్రికెట్ ఎంట్రీ ఇస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో కేవలం 1900 ప్యారీస్ ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఒక ఈవెంట్‌గా నిర్వహించారు. కేవలం ఒకే ఒక మ్యాచ్ నిర్వహించగా అందులో గ్రేట్ బ్రిటన్ గెలుపొందింది. ఆ తర్వాత క్రికెట్ ఊసే లేదు. అప్పట్లో క్రికెట్ ఆరు రోజుల పాటు నిర్వహించే ఫార్మాట్‌లో ఉండటంతో దానికి ఒలింపిక్స్‌లో స్థానం లేకుండా పోయింది. అయితే వన్డే క్రికెట్ వచ్చిన తర్వాత మరోసారి క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే గత కొన్నేళ్ళుగా ఐసీసీ ప్రయత్నాలు ఫలించి లాస్ ఏంజెల్స్ లో క్రికెట్ ను చేర్చారు. కాగా టి20 ఫార్మాట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా మిగతా ఐదు జట్లను నిర్ణయించే అవకాశముంది. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ తర్వాత ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడగా క్రికెట్‌కు గుర్తింపు వచ్చింది. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్‌ ఒలింపిక్స్‌లో రీఎంట్రీ ఇస్తోంది.