ఐపీఎల్ మెగావేలానికి ముందే ఫ్రాంచైజీలు తమ కోచింగ్ స్టాఫ్ ను నియమించుకుంటున్నాయి. తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా వ్యవహరించనున్నాడు. జహీర్ కు లక్నో ఫ్రాంచైజీ స్పెషల్ వీడియో, జెర్సీలతో స్వాగతం పలికింది. కాగా లక్నో షేర్ చేసిన వీడియోలో యంగ్ క్రికెటర్లు జహీర్ ఖాన్ యాక్షన్‌ను కాపీ చేస్తూ కనిపించారు. ఆఖర్లో ఎంట్రీ ఇచ్చిన జహీర్.. లక్నోకు వచ్చేశా అంటూ చెప్పిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే వీడియోలో . టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా 34వ నంబర్ జెర్సీని జహీర్‌కు ఇస్తూ జట్టులోకి ఆహ్వానించాడు. తన అంతర్జాతీయ కెరీర్, ఐపీఎల్ కెరీర్ మొత్తం జహీర్ 34వ నంబర్ జెర్సీతోనే ఆడాడు. దీంతో అతనికి మెంటార్ గానూ అదే నంబర్ కేటాయించింది. గతంలో ఐదేళ్ల పాటు ముంబై ఇండియన్స్ సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న 45 ఏళ్ల జహీర్ రెండేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
కాగా లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు తొలి రెండు సీజన్లలో గౌతమ్ గంభీర్ మెంటార్ గా వ్యవహరించాడు. తర్వాత గంభీర్ కోల్ కత్తాకు వెళ్ళిపోవడంతో ఆ మెంటార్ బాధ్యతలు ఖాళీగానే ఉన్నాయి. తాజాగా గంభీర్ కు రీప్లేస్ మెంట్ తరహాలో జహీర్ ను లక్నో ఫ్రాంచైజీ మెంటార్ గా ఎంపిక చేసింది. కాగా జహీర్ ఖాన్ ప్లేయర్ గా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ఆడాడు. 10 సీజన్ల లో 100 మ్యాచ్ లు ఆడిన ఈ మాజీ పేసర్ 102 వికెట్లు తీశాడు.