కారు దిగిన మైనంపల్లి..
ఈ మధ్యకాలంలోబీఆర్ఎస్ లో వివాదాస్పదమ్‌గా మారిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటారా..? పార్టీని వీడతారా..? అని కొంత కాలంగా ఊగిసలాటలు నడిచిన సంగతి తెలిసిందే. కనీసం ఆయన అనుచరుల్లో కూడా క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీలో రెండు టికెట్లు ఆశించిన మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీలో తనకు రెండు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు కోరిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి సహా, తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కోసం మెదక్ స్థానం ఇవ్వాలని కోరారు. అందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన తొలి విడత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కేవలం మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చినట్లుగా చెప్పడం జరిగింది. నిజానికి అంతకుముందే మైనంపల్లి రెబల్ గా మారినప్పటికీ, అభ్యర్థుల ప్రకటనలో ఆయన పేరును తొలగించలేదు.
కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం.. బీఆర్ఎస్ కు రాజీనామా..
తర్వాత తనకు పార్టీ కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని మైనంపల్లి చాలా సందర్భాల్లో చెప్పారు. తాను కేసీఆర్, కేటీఆర్ చివరికి ఆ దేవుణ్ని కూడా లెక్క చేయబోనని అన్నట్లుగా ఆడియో టేప్‌లు కూడా వైరల్ అయ్యాయి. తనకు రెండు టికెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ ను మాత్రం ఆయన వదల్లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుతిరిగి.. అసలు ఆయన పార్టీలో ఉంటారా? లేక కాంగ్రెస్ లో చేరతారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు, మైనంపల్లి పైన బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు తీసుకోలేదు. ఏ చర్యలు తీసుకోని బీఆర్ఎస్ మైనంపల్లి అడుగులు ఎటు వైపు వేస్తారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. తన భవిష్యత్ కార్యాచరణను ఆయన ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఇప్పటికే రెండు సార్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసిన మైనంపల్లి మంత్రి కేటీఆర్‌తో భేటీకి ఆవకాశం ఉన్నప్పటికీ ప్రయత్నించడం లేదు. సీఎం కేసీఆర్‌ను కలిసి స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ధిక్కార స్వరం వినిపించిన మైనంపల్లిని ప్రోత్సహిస్తే.. ఇతరులు కూడా అదే పని చేసే అవకాశం ఉంటుందని అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని నేతలు హైకమాండ్‌కు సూచిస్తున్నారు.